voter id: స్మార్ట్ ఫోన్ యాప్ నుంచే ఓటరుగా నమోదు... మార్పు, చేర్పులు... త్వరలోనే
- యాప్ ను అభివృద్ధి చేసిన ఎన్నికల సంఘం
- జూన్ నుంచి దేశవ్యాప్తంగా అమలుకు అవకాశం
- ఇప్పటికే 22 రాష్ట్రాలు ఇందులో భాగం
ఓటర్ గా నమోదు చేసుకోవడం, ఓటు హక్కు పొందడం అతి త్వరలోనే చాలా సులభంగా మారనుంది. స్మార్ట్ ఫోన్లో యాప్ నుంచే పేరు నమోదు చేసుకుని ఓటు హక్కు పొందొచ్చు. అంతేకాదు ఓటర్ తన నివాస చిరునామా వివరాల్లో మార్పులు, చేర్పులను అదే యాప్ నుంచి తనే చేసుకోవచ్చు. ఎలక్షన్ కార్యాలయం వరకూ వెళ్లాల్సిన శ్రమ ఉండదు. ఇందుకు సంబంధించి భారత ఎన్నికల సంఘం ERONET పేరుతో యాప్ ను అభివృద్ధి చేసింది.
ఇప్పటి వరకు 22 రాష్ట్రాలు ఈ అప్లికేషన్ లో భాగమయ్యాయని ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ తెలిపారు. గుజరాత్, హిమాచల్ సహా ఇంకా కొన్ని రాష్ట్రాలు ఈ వ్యవస్థను అమలు చేయలేదన్నారు. జూన్ నాటికి మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ వెబ్ ఆధారిత అప్లికేషన్ లో భాగమవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. దీంతో దేశవ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. ఓటర్లు తమ మొబైల్ కు వచ్చే ఓటీపీ సాయంతో తమ ఓటరు ఐడీ వివరాల్లో మార్పులు చేసుకోవచ్చని రావత్ చెప్పారు. కొత్త చిరునామాను ఎంటర్ చేసిన తర్వాత అంతకుముందున్న చిరునామా అందులో డిలీట్ అవుతుందని తెలిపారు.