us senator: గ్రీన్ కార్డుల బ్యాక్ లాగ్ ను తగ్గించేందుకు సవరణలను ప్రతిపాదించిన సెనేటర్
- గ్రీన్ కార్డుల కోటా తొలగింపు
- హెచ్1బీ వేతన పరిమితి పెంపు
- ఇవి వివేకంతో కూడిన సంస్కరణలన్న సెనేటర్ ఒరిన్ హ్యాచ్
అమెరికా అధ్యక్ష కార్యాలయం మద్దతు ఉన్న ఇమ్మిగ్రేషన్ బిల్లుకు ప్రముఖ సెనేటర్ ఒరిన్ హ్యాచ్ సవరణలు ప్రతిపాదించారు. వార్షికంగా ప్రతీ దేశానికి గ్రీన్ కార్డుల విషయంలో ఉన్న కోటాను తొలగించడం ఈ సవరణల్లో కీలకమైనది. అధిక నైపుణ్యాలు కలిగిన వలసల విధానం అన్నది ప్రతిభ ఆధారంగానే ఉండాలని తాను ఎప్పటినుంచో చెబుతూనే ఉన్నానని హ్యాచ్ పేర్కొన్నారు.
హెచ్1బీ వేతన పరిమితిని 60,000 డాలర్ల నుంచి 1,00,000 డాలర్లకు పెంచడం హ్యాచ్ సవరణల్లో మరొకటి. సాంకేతిక నైపుణ్యాలు మెరుగ్గా ఉన్న వారు గ్రీన్ కార్డు పొందేందుకు ఈ సవరణలు తోడ్పడతాయని హ్యాచ్ తెలిపారు. తాను ప్రతిపాదించిన సవరణలు వివేకంతో కూడినవని, అమెరికా ఆర్థిక రంగంలో అసలైన మార్పును తీసుకొస్తాయని సమర్థించుకున్నారు. ఈ సవరణలు భారతీయ అమెరికన్లకు మేలు చేసేవే. గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని వేచి చూసే వారిలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉంది. కోటా తొలగిస్తే ఎక్కువ మంది గ్రీన్ కార్డులు పొందేందుకు వీలవుతుంది.