Pawan Kalyan: పవన్ కల్యాణ్ ని కలిసిన యోగేంద్ర యాదవ్, చలసాని శ్రీనివాస్
- స్వరాజ్ అభియాన్ నేత యోగేంద్ర, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసానికి సాదర స్వాగతం
- తన అనంత పర్యటన గురించి ప్రస్తావించిన యోగేంద్ర
- జేఎఫ్ సీకు సంఘీభావం ప్రకటించిన చలసాని
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను స్వరాజ్ అభియాన్ నేత, ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కార్యనిర్వాహక సభ్యుడు యోగేంద్ర యాదవ్ కలిశారు. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యోగేంద్రకు పవన్ సాదర స్వాగతం పలికారు. ఇటీవల అనంతపురం జిల్లాలో తాను జరిపిన పర్యటన వివరాలను ఆయన పవన్ కు వివరించారు. బుందేల్ ఖండ్ మాదిరే అనంతపురం జిల్లా ఉంది: యోగేంద్ర యాదవ్
ఢిల్లీ వాసిని అయిన తనకు ఆంధ్రప్రదేశ్ అంటే పచ్చటి పొలాలు, గోదావరి, కృష్ణ నదులతో కళకళలాడుతుందని మాత్రమే తెలుసని, అయితే అనంతపురం జిల్లాను చూసిన తరువాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని యోగేంద్ర చెప్పారు. అనంతపురం జిల్లా కరవు, నిరుద్యోగం, ఆకలి బాధలు, నేతన్నల కష్టాలు చూసి తాను చలించిపోయానని చెప్పారు. బుందేల్ ఖండ్ మాదిరిగానే అనంతపురం జిల్లా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చలసానికి సాదర స్వాగతం పలికిన పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు ఈరోజు సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ని కలుసుకున్నారు. పవన్ చొరవతో ఏర్పాటైన జాయింట్ ఫాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్ సీ)కు ఆయన సంఘీభావం ప్రకటించారు. రేపు హైదరాబాద్ లో జరగనున్న జేఎఫ్ సీ తొలి సమావేశానికి తమ సమితి ప్రతినిధులతో కలిసి హాజరవుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఎంత ఇచ్చిందో, ఎంత ఖర్చయిందో, ఇంకా రావాల్సింది ఎంత ఉందో లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉందని చలసాని అన్నారు. ఈ సందర్భంగా పవన్ తో చలసాని కొంత సేపు ఏకాంత చర్చలు జరిపారు.