Andhra Pradesh: వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని అమలు చేయాలి : మంత్రి దేవినేని
- కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో సమీక్ష
- కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీకు సంబంధించిన అంశాలపై చర్చించాం
- పట్టిసీమ, పురుషోత్తపట్నం ఇరిగేషన్ ప్రాజెక్టుల నిధులను విడుదల చేయమని కోరాం: దేవినేని
ఆంధ్ర ప్రదేశ్ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు పరిధిని నోటిఫై చేసి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి మరోమారు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు చెప్పారు.
కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరి సమక్షంలో ‘ప్రధాన మంత్రి కృషి సించాయ్ యోజన (పీఎంఎస్ కే వై) సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆ శాఖ కార్యదర్శి యు.పి. సింగ్ వివిధ రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజనీర్-ఇన్-చీఫ్ లతో ఢిల్లీ లో ఈ సమావేశం నిర్వహించారు.
సమావేశం అనంతరం మీడియాతో దేవినేని మాట్లాడుతూ కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మానేజ్మెంట్ బోర్డులకు (జీఆర్ఎంబీ) సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ తరువాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ లో వచ్చిన తీర్పులపై సుప్రీం కోర్టులో లో నేటికి వాదనలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచిన విధంగా కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని, దీని వలన ఆయకట్టు చివరి భూములకు కూడా నీరును అందించే వెసులుబాటు కలుగుతుందని, ఇరు రాష్ట్రాల అధికారులు దీనిపై చర్చిస్తున్నారని చెప్పారు.
ఇందుకు సంబంధించి అపెక్స్ కౌన్సిల్ ను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం వున్నట్లు అధికారుల సమావేశంలో వెల్లడైనట్లు చెప్పారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువల క్రింద చివరి ఆయకట్టు భూములకు సాగునీటి సరఫరాలో ఈ ఏడాది అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు ప్రభుత్వ దృష్టికి తెచ్చానని, విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా అమలు చేయాలని కేంద్ర అధికారులను రాష్ట్ర ముఖ్య కార్యదర్శి, ఇంజనీరింగ్ అధికారులు కోరినట్లు చెప్పారు. గోదావరి నది నీటి లభ్యత, వినియోగ వివరాలను వచ్చే సమావేశంలో సమర్పించాలని కేంద్ర అధికారులు కోరారని, కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులను, కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీలకు వెంటనే సమర్పించాలని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కోరి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టిసీమ, పురుషోత్తపట్నం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. దశాబ్దకాల క్రితం 1858.67 కోట్ల రూపాయలతో చేపట్టిన 8 ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 498.90 కోట్ల రూపాయలను విడుదల చేసిందని, మిగిలిన మొత్తాన్ని సత్వరమే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులకు విజ్ఞప్తి చేసినట్లు దేవినేని వివరించారు.
8 ప్రాజెక్టులలో ఇప్పటికే ఒక ప్రాజెక్టు పూర్తి కాగా మిగిలిన 7 ప్రాజెక్టులను డిసెంబర్ 2018 సంవత్సరం నాటికి పూర్తి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ధరల సూచిక ప్రకారం ఈ ప్రాజెక్టుల అంచనాల విలువ రూ.3,600 కోట్లుగా అంచనా వేసినట్లు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళినట్లు తెలిపారు. కమాండ్ ఏరియా డెవలప్ మెంట్ పనులకు సంబంధించి రూ.1093.49 కోట్లు విలువ గల ప్రాజెక్టు రిపోర్టులను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించామని అన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించి రూ.102.79 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని, మిగిలిన నిధులను మంజూరు చేయాలని కోరామని, గుండ్లకమ్మ, తాడిపూడి, తారకరామ, పుష్కర ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాను నాబార్డ్డు నుంచి సమకూర్చాలని కోరినట్లు దేవినేని ఉమా పేర్కొన్నారు.