Jacob zuma: దక్షిణాఫ్రికా అధ్యక్షుడి అవినీతి వెనక ఉత్తరప్రదేశ్ బ్రదర్స్!
- రేషన్ షాపు నుంచి మహా వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన గుప్తా బ్రదర్స్
- అధ్యక్షుడికి అత్యంత సన్నిహితంగా మారిన వైనం
- ప్రభుత్వ నిర్ణయాల్లో వీరిదే పైచేయి
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకోబ్ జుమా రాజీనామాకు కారణమైన అవినీతి వెనక ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారన్న విషయం తెలిసిన ప్రపంచం నోరెళ్లబెట్టింది. గుప్తా బ్రదర్స్‌గా దక్షిణాఫ్రికాకు పరిచయమైన అజయ్, అతుల్, రాజేశ్‌లు ఏకంగా ఓ దేశాధ్యక్షుడిని ఓ ఆట ఆడించారని తెలిసి ప్రపంచం నివ్వెరపోయింది.
జుమా పదవిని అడ్డుపెట్టుకుని ఏకంగా ఓ పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న గుప్తా బ్రదర్స్ రాజకీయాల్లోనూ తమ హవా కొనసాగించారు. అధ్యక్షుడితో సత్సంబంధాలు పెంచుకున్న వీరు కేబినెట్లో ఎవరు ఉండాలి? ఎవరికి ఎటువంటి బాధ్యతలు అప్పగించాలి? అన్న విషయాలను కూడా డిసైడ్ చేసే స్థాయికి చేరుకున్నారు. ఫలితంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా జుమా అవినీతికి కారణమయ్యారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడి రాజీనామాకు కారణమైన ఈ గుప్తా బ్రదర్స్ ఎవరన్న ప్రశ్న అటు సౌతాఫ్రికా, ఇటు ఇండియన్ల మెదళ్లను తొలిచేస్తోంది.
గుప్తా బ్రదర్స్‌ది యూపీలోని షహరాన్‌పూర్. స్థానిక రాణి బజార్లో వీరి తండ్రి శివకుమార్‌కు రేషన్ షాపు ఉండేది. మొన్న శివరాత్రి రోజున వీరు రాణిబజార్కు వచ్చినట్టు తెలుస్తోంది. వీరిని స్థానికులు ఇప్పటికీ ‘రేషన్ షాపోళ్లు’ గానే పిలుస్తుంటారు. తండ్రి స్మారకార్థం ఓ దేవాలయాన్ని నిర్మించిన గుప్తా బ్రదర్స్ ప్రతి ఏడాది క్రమం తప్పకుండా శివరాత్రి ఉత్సవాలకు హాజరవుతుంటారు. మొన్న శివరాత్రి రోజున వచ్చి అదే రోజున వెళ్లిపోయారు.
1985లో గుప్తా కుటుంబం రాణి బజార్ నుంచి తన మకాంను ఢిల్లీకి మార్చింది. 1993లో అక్కడి నుంచి దక్షిణాఫ్రికాలోని ప్రధాన నగరమైన జొహన్నెస్‌బర్గ్‌కు వలస వెళ్లారు. అక్కడ వ్యాపారం ప్రారంభించిన గుప్తా బ్రదర్స్ అచిర కాలంలోనే మహా సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. మైనింగ్, మీడియా, ఇంజినీరింగ్ ప్రాజెక్టులు.. ఇలా ప్రతీ రంగంలోనూ పెట్టుబడులు పెట్టారు. వీరికి జాకోబ్ జుమా కుటుంబం అండగా నిలిచింది. 2009లో జుమా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో గుప్తా బ్రదర్స్ కు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
చివరికి జుమాకు వీరు ఎంతలా మారారంటే.. వీరు ఎంత చెబితే అంత అన్నట్టుగా. అధ్యక్షుడు తీసుకునే నిర్ణయాలన్నీ వీళ్లకు అనుకూలంగా ఉండేవి. ఆయన అండతో కోట్లాది రూపాయలు పోగేసుకున్నారు. ఫలితంగా దక్షిణాఫ్రికాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా గుప్తా ఫ్యామిలీ ఖ్యాతికెక్కింది. గుప్తా ఫ్యామిలీ కుంభకోణాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు రావడంతో అది జుమా మెడకు చుట్టుకుంది. సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో జుమా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.