Ravichandran Ashwin: ప్రపంచకప్ రేసు నుంచి అశ్విన్, రవీంద్ర జడేజా అవుట్: అతుల్ వాసన్
- వరల్డ్ కప్ జట్టులో అశ్విన్, జడేజాలకు స్థానం గల్లంతు?
- కుల్దీప్ యాదవ్, చాహల్‌తో వారి స్థానాలను భర్తీ చేసే అవకాశం
- కెప్టెన్ కోహ్లీ కూడా వారి వైపే మొగ్గు
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలకు ప్రపంచకప్‌లో ఆడే అవకాశాలు దాదాపు లేనట్టేనని టీమిండియా మాజీ పేసర్, ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) చైర్మన్ అతుల్ వాసన్ తేల్చి చెప్పాడు. టీమిండియా యువ బౌలర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లు వీరిద్దరి స్థానాలను భర్తీ చేస్తారని ఆయన పేర్కొన్నాడు. అద్భుతంగా రాణిస్తూ జట్టులో చోటు సంపాదించుకున్న ఈ మణికట్టు స్పిన్నర్లు బౌలింగ్‌తో అదరగొడుతున్నారని, ప్రపంచకప్ వరకు వీరు కొనసాగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చాహల్, కుల్దీప్లు గాయాల కారణంగా జట్టులో చోటు కోల్పోతే తప్ప అశ్విన్, జడేజాలకు చోటు దక్కే అవకాశమే లేదని వాసన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్‌కు ముందు వీరిద్దరితో కనీసం 50 వన్డేలు అయినా ఆడించాలని అన్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్, చాహల్‌లను ప్రపంచకప్ వరకు జట్టులో కొనసాగించాలని క్రీడా పండితులు కూడా టీమిండియా మేనేజ్మెంట్ను కోరుతున్నారు. మరోవైపు కెప్టెన్ కోహ్లీ సైతం ఈ మణికట్టు మాంత్రికులు జట్టులో ఉండాల్సిందేనని పట్టుబడుతున్నాడు. దీంతో ప్రపంచకప్ జట్టులో వీరి స్థానం దాదాపు ఖాయమైనట్టేనని చెబుతున్నారు. అయితే టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ మాత్రం అశ్విన్, జడేజాలకు తలుపులు మూసుకుపోలేదని పేర్కొన్నాడు. తమ సత్తా నిరూపించుకోగలిగితే వారికి ప్రపంచకప్ జట్టులో చోటు లభిస్తుందని అన్నాడు.