Chittoor District: చిత్తూరు జిల్లాలో పెను విషాదం... డ్రైనేజ్ లో విషవాయువుల బారినపడి ఏడుగురి మృతి!
- వెంకటేశ్వరా హేచరీస్ లో ప్రమాదం
- డ్రైనేజిని శుభ్రం చేస్తూ విషాన్ని పీల్చిన కార్మికులు
- ఆసుప్రతికి తరలిస్తుండగా నలుగురు మృతి
- ఆపై మరో ముగ్గురు కూడా
చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలంలోని మొరంలో పెను విషాదం చోటుచేసుకుంది. పౌల్ట్రీ ఉత్పత్తుల పరిశ్రమను నిర్వహిస్తూ, వెంకీస్, వెన్ కాబ్ వంటి పలు బ్రాండ్లను మార్కెటింగ్ చేస్తున్న వెంకటేశ్వర హేచరీస్ లో ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించే క్రమంలో ఓ డ్రైనేజిలోకి దిగిన ఏడుగురు కార్మికులు విషపూరిత రసాయనాల బారిన పడి మృతిచెందారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ ఉదయం హేచరీస్ అధికారుల ఆదేశాలతో తొలుత నలుగురు కార్మికులు డ్రైనేజీలోకి దిగారు.
ఆ డ్రైనేజీలోకి హేచరీస్ నుంచి వస్తున్న రసాయనాలు కలుస్తుండటంతో ఆ నలుగురూ అందులోనే స్పృహ కోల్పోయారు. వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించిన మరో ముగ్గురు కూడా విష రసాయనాలను పీల్చి అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు ఆ మురుగు కాలువ పైకప్పును పెకిలించి, వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నలుగురు, ఆసుపత్రిలో మరో ఇద్దరు, చిత్తూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు మరణించారు. దీంతో మొరంలో విషాదఛాయలు అలముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.