Australia: అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా!
- న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా
- 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం
- న్యూజిలాండ్ 243/6
- ఆస్ట్రేలియా 245/5
అంతర్జాతీయ టీ-20 క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసి ఆరు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేయగా ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో ఆ జట్టుపై విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టులో 24 బంతుల్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్ 59 పరుగులు చేయగా, షార్ట్ 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు.
వారు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కూడా ధాటిగా ఆడారు. క్రిస్ లిన్ 13 బంతుల్లో 18, మాక్స్వెల్ 14 బంతుల్లో 31, ఫించ్ 14 బంతుల్లో 36 పరుగులు చేసి అవుట్ కాగా.. స్టోయినిస్ 5 బంతుల్లో 4, అలెక్స్ కారే ఒక బంతి ఆడి ఒక పరుగు తీసి నాటౌట్‌గా నిలిచి మరో 7 బంతులు మిగిలి ఉండగానే, ఆస్ట్రేలియాను విజయ తీరానికి చేర్చారు. ఆస్ట్రేలియాకు 20 పరుగులు ఎక్స్ ట్రాల రూపంలో వచ్చాయి. దీంతో 245/5 (18.5 ఓవర్లలో) పరుగులు చేయగలిగింది. 44 బంతుల్లో 76 పరుగులు చేసిన షార్ట్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.