india: నాకు చాలా సంతోషంగా ఉంది: విరాట్ కోహ్లీ
- దక్షిణాఫ్రికాపై వన్డే సిరీస్ సొంతం చేసుకున్న సంతోషంలో కోహ్లీ
- ఈ విజయం తన స్నేహితులు, సన్నిహితులదే
- కెప్టెన్ గా ఉండి జట్టును విజయవంతంగా నడిపించడం వరం
- టీ20 మ్యాచ్ ల్లోనూ మా సత్తా చాటుతాం : కోహ్లీ
దక్షిణాఫ్రికా గడ్డపై ఆ దేశంతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భారత్ కు నిరాశ ఎదురైంది. అయితే, వన్డే సిరీస్ మాత్రం టీమిండియా ఘనంగా దక్కించుకుంది. 5-1 ఆధిక్యంతో వన్డే సిరీస్ ను టీమిండియా దక్కించుకుంది. దక్షిణాఫ్రికాతో నిన్న జరిగిన చివరి వన్డే నామమాత్రపు మ్యాచే అయిన్పటికి టీమిండియా విజయం సాధించింది. వన్డే సిరీస్ లో మూడు సెంచరీలు చేసిన కోహ్లీ, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా కోహ్లీ నిలిచాడు.
ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ, తాను చాలా సంతోషంగా ఉన్నానని అన్నాడు. దక్షిణాఫ్రికా వ్యూహాన్ని తిప్పికొట్టామని, ఈ విజయం తన స్నేహితులు, సన్నిహితులదేనని అన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ తానే ముందుండి నడిపించాలని కోరుకుంటానని, అదో గొప్ప అనుభూతి అని చెప్పాడు. ఇంకో, ఎనిమిది తొమ్మిదేళ్లు తన కెరీర్ ఉంటుందేమోనని, అందుకే, ప్రతిరోజుని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నానంటూ కోహ్లీ భావోద్వేగం చెందాడు.
కెప్టెన్ గా ఉండి జట్టును విజయవంతంగా నడిపించడం వరంగా భావిస్తున్నానని చెప్పిన కోహ్లీ, ఓపెనర్లు శిఖర్ థావన్, రోహిత్ శర్మ, స్పిన్నర్లు చాహల్, కుల్ దీప్ కీలక సమయాల్లో తమ సత్తా చాటారని ప్రశంసించాడు. తమ పర్యటన ఇంకా ముగియలేదని, ఇరు జట్ల మధ్య జరగనున్న టీ20 మ్యాచ్ లపై ఉందని, ఈ మ్యాచ్ ల్లో కూడా తమ సత్తా చాటుతామని కోహ్లీ ధీమాగా చెప్పాడు.