Railway Ministry: రైలు బోగీలపై రిజర్వేషన్ చార్టుల ప్రదర్శనకు స్వస్తి!
- ఏ1, ఏ, బి కేటగిరీ స్టేషన్లలో ఆర్నెల్లు ప్రయోగాత్మకంగా అమలు
- ప్లాస్మా తెరపై యథావిధిగా రిజర్వేషన్ వివరాల ప్రదర్శన
- అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ
రైలు బోగీలపై ప్రయాణికుల బెర్త్ రిజర్వేషన్ వివరాలకు సంబంధించిన చార్టులను అతికించడాన్ని ఆరు నెలల పాటు నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. మార్చి 1 నుండి దీనిని ఏ1, ఏ, బి కేటగిరీ రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ అన్నిజోన్లకు ఆదేశాలను జారీ చేసింది. ఏదేమైనప్పటికీ, స్టేషన్లలో ఉండే చార్టు బోర్డులపై రిజర్వేషన్ చార్టులను అతికించడం మాత్రం కొనసాగుతుందని తెలిపింది.
ఆయా స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్లాస్మా తెరలు యథావిధిగా చార్టుల్లోని వివరాలను ప్రదర్శిస్తాయి. న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబై సెంట్రల్, చెన్నై సెంట్రల్, హౌరా, సీల్దా స్టేషన్లలోని అన్ని రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ బోగీలపై ఈ రిజర్వేషన్ చార్టులు అతికించడాన్ని మూడు నెలల పాటు ఆపేసిన తర్వాత తాజాగా ఏ1, ఏ, బి కేటగిరీ రైల్వే స్టేషన్లలో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాన్ని రైల్వే శాఖ ఈ నెల 13న జారీ చేసింది.