RGV: పోలీసు అధికారిలా నటిస్తున్నట్లు ఫీలయ్యాను.. విచారణకు హాజరైన వైనంపై రామ్ గోపాల్ వర్మ సెటైర్లు
- ఈ రోజు విచారణకు వెళుతుండగా తీసినప్పటి ఫొటోను పోస్ట్ చేసిన వర్మ
- సినీ దర్శకులందరూ దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలంటూ ట్వీట్
- స్పందించి, నటుడిగా అవకాశం ఇస్తానన్న పూరీ జగన్నాథ్
జీఎస్టీ పేరుతో శృంగారమే ప్రధానాంశంగా సినిమా తీయడం, మరోపక్క మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి కేసుల్లో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ రోజు హైదరాబాద్‌లో పోలీసు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. దీనిపై కూడా వర్మ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను విచారణకు వెళుతోన్న సమయంలో తీసుకున్న ఓ ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. దాన్ని చూపెడుతూ.. తాను పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నట్లు ఫీలయ్యానని తెలిపారు.
సినీ దర్శకులందరూ దయచేసి ఈ విషయాన్ని గుర్తించాలని, తనకు నటుడిగా అవకాశం ఇవ్వాలనీ వర్మ చమత్కారంగా కామెంట్ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన దర్శకుడు పూరీ జగన్నాథ్.. 'సర్, స్క్రిప్ట్ రెడీగా ఉంది.. మీ డేట్ల కోసం ఎదురుచూస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. దీనికి వర్మ రిప్లై ఇస్తూ 'థ్యాంక్యూ సర్' అని పేర్కొన్నారు.