Prime Minister Narendra Modi: పీఎన్బీ స్కాంపై ప్రధాని నోరు విప్పరా?... నిప్పులు చెరిగిన రాహుల్
- నీరా మోదీతో సంబంధాలు లేవని స్పష్టీకరణ
- బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకానికి తీసుకునే చర్యలేంటో చెప్పాలని డిమాండ్
- మీడియా సమావేశంలో ప్రధానిపై ధ్వజం
బ్యాంకింగ్ రంగానికి షాకిచ్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) మోసంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. ఈ మోసం ఎందుకు జరిగిందో వివరించాలని, దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని కలిగించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కూడా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)ని రద్దు చేసిన తర్వాత దాని స్థానంలో ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం న్యూఢిల్లీలో శనివారం జరిగింది.
సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పెద్ద నోట్ల రద్దు మొదలుకుని ప్రధాని తన చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. పీఎన్బీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నట్లు బీజేపీ చేస్తున్న ఆరోపణలను రాహుల్ ఖండించారు. విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే వారు అలా తనపై బురద జల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.
విద్యార్థులకు పరీక్షలు ఎలా రాయాలో చెప్పడానికి ప్రధాని ఒకటిన్నర గంట సమయాన్ని వెచ్చించడానికి బదులుగా నీరవ్ మోదీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థపై నమ్మకం కలిగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న సంగతిని దేశ ప్రజలకు ఆయన వివరించాలని రాహుల్ డిమాండ్ చేశారు. పీఎన్బీ కుంభకోణంపై రక్షణ, సామాజిక న్యాయశాఖ మంత్రులు మాట్లాడుతున్నారనీ, అయితే ఇందుకు బాధ్యులైన ఆర్థికమంత్రి, ప్రధానమంత్రులు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని కాంగ్రెస్ సారధి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.