Andhra Pradesh: కేంద్రానిది ఓ నాటకం, రాష్ట్రానిది మరో నాటకం: సీపీఎం నేత మధు
- విజయవాడలో కొనసాగుతున్న రౌండ్ టేబుల్ సమావేశం
- రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి: మధు
- కన్ఫ్యూజన్ నుంచి చంద్రబాబు బయటకు రావాలి: రామకృష్ణ
- హోదా కోసం పాటుపడతామని ముుందుకొచ్చిన కాంగ్రెస్ తన పాపాన్ని సగం కడుక్కుంది : హీరో శివాజీ
ఏపీకి ప్రత్యేకహోదా కోసం వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు మాట్లాడుతూ, ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని పిలుపు నిచ్చారు. సీఎం చంద్రబాబు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఆయనకు చిత్తశుద్ధి ఉంటే, ఆయన పిలిస్తే పోరాడేందుకు తాము వస్తామని అన్నారు.
ఇదేమీ సీఎం సొంత వ్యవహారం కాదని, రాష్ట్రానికి సంబంధించిందని, కేంద్రానిది ఓ నాటకం, రాష్ట్రానిది మరో నాటకమంటూ విమర్శలు గుప్పించారు. రాజకీయ క్రీడలో కొన్ని పార్టీలు బిజీగా ఉన్నాయని అన్నారు. రాష్ట్రానికి రూ.9 వేల కోట్లకు బదులు కేవలం రూ.420 కోట్లు మంజూరు చేశారని, ఈవిధంగా నిధులు మంజూరు చేస్తే ఏపీ కోలుకోవడానికి ముప్పై ఏళ్లు పడుతుందని అన్నారు. మార్చి 5,6 తేదీల్లోగా అంతా తేలిపోతుందని చెప్పారు. ఇంకా, ఈ సమావేశంలో ఎవరు ఏమన్నారంటే..
సీపీఐ నేత రామకృష్ణ : రాష్ట్రానికి ఏమేం సాధించాలనే విషయంపై ఒక్క చంద్రబాబుకు తప్ప అందరికీ స్పష్టత ఉంది. చంద్రబాబు ప్రత్యేక హోదా, ప్యాకేజ్ సమానమని చెప్పి, ఇప్పుడు అది కాదంటూ గందరగోళంలో ఉన్నారు. ఆ కన్ఫ్యూజన్ నుంచి చంద్రబాబు బయటకు రావాలి. ఢిల్లీ కేంద్రంగా అంతిమ పోరాటం చేయాలి.
హీరో శివాజీ : మూడేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తున్నాం. ఇప్పటి వరకు ప్రధాని మోదీ చెప్పిన అబద్ధాలను నమ్మూతూ వచ్చాం. హోదా కోసం పాటుపడతామని కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి తన పాపాన్ని సగం కడుక్కుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం ఎన్నో చేసింది. కానీ, బీజేపీ మాత్రం మాటలతో పబ్బం గడుపుతోంది. వ్యక్తిగతంగా నేను ఎవరినీ విమర్శించడం లేదు. ఎక్కడ అవమానం జరిగిందో అక్కడే మనం పోరాడాలి. పవన్ ఇప్పటికైనా ముందుకు వచ్చినందుకు సంతోషం. పార్టీలకు అతీతంగా పోరాటం చేయాలి.
‘జనసేన’ నేత పోతిన మహేష్ : ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు పిలుపు నిచ్చినా మా మద్దతు ఉంటుంది. హామీల అమలుకు బీజేపీ ముందుకు రావాలి.