Telangana: సమతుల, పరిమిత ఆహారమే మేలు: కేంద్ర మంత్రి శ్రీపాద్ యశో నాయక్
- ప్రాకృతిక ఆహార మేళా ముగింపు సమావేశంలో పాల్గొన్న మంత్రి
- పౌష్టికాహారమే ఆరోగ్యానికి పది వేలు : శ్రీపాద్ యశో నాయక్
- ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అనేక పథకాలు
- అవగాహన, చైతన్యంతోనే ఆరోగ్య పరిరక్షణ సాధ్యం: మంత్రి లక్ష్మారెడ్డి
సహజ, సాత్విక, సమతుల, పరిమిత ఆహారంతోనే మేలు జరుగుతుందని, పౌష్టికాహారమే ఆరోగ్యానికి మంచిదని కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీపాద్ యశో నాయక్ అన్నారు. భారత జాతీయ పౌష్టికాహార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆయుష్ భాగస్వామ్యంతో రెండు రోజుల పాటు నిర్వహించిన ప్రాకృతిక ఆహార మేళా ముగింపు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా యశోనాయక్, తెలంగాణ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీపాద్ యశో నాయక్ మాట్లాడుతూ, ఆధునిక ప్రపంచ వేగంలో మనమంతా కొట్టుకుపోతున్నామని, అసహజ, అసంతులిత ఆహారానికి అలవాటు పడ్డామని అన్నారు. దీంతో అనారోగ్యం బారిన పడి వ్యాధులను కొనితెచ్చుకుంటున్నామని అన్నారు. కిడ్నీ, గుండె, కాలేయం, క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి విముక్తి లభించాలంటే ఫాస్ట్ ఫుడ్ కు స్వస్తి పలకాలని, సేంద్రీయ ఎరువులతో పండించిన పంటలు, సాత్విక ఆహారాన్ని తీసుకోవాలని మంత్రి సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తాము అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు.
అనంతరం, మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, రెండు రోజుల ప్రదర్శనకు మంచి స్పందన వచ్చిందని నిర్వాహకులను అభినందించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అనేక పథకాలు అమలు అవుతున్నాయని, ప్రజల్లో అవగాహన, చైతన్యంతోనే ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందని అన్నారు. ప్రజల్లో వ్యాధుల పట్ల అవగాహన, చైతన్య కార్యక్రమాలు తీసుకు వస్తామని. ఇప్పటికే క్యాన్సర్ స్క్రీనింగ్ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సహజ పౌష్టికాహార ప్రదర్శన ఏర్పాటు చేస్తామని చెప్పారు.
కాగా, పీపుల్స్‌ప్లాజాలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రులు పరిశీలించారు. ఏపీ సహా పలు రాష్ట్రాల ప్రతినిధులు తమ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఆహార పదార్థాలను తీసుకుని మంత్రులు పరిశీలించారు. ఆయా ఆహార పదార్థాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎన్ఐఎన్ నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు మంత్రులిద్దరూ బహుమతి ప్రదానం చేశారు.