Pawan Kalyan: జగన్ సవాలును స్వీకరిస్తున్నా.. మార్చి 4న ఢిల్లీకి సైతం వస్తా!: పవన్ కల్యాణ్ ప్రకటన
- అవిశ్వాస తీర్మానానికి అందరి మద్దతు వచ్చేలా చేస్తా
- పార్లమెంటరీ గైడ్ లైన్స్ ప్రకారం మొదట ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చు
- అనంతరం 50 మంది ఎంపీల మద్దతు కూడగట్టొచ్చు
- కోరితే టీఆర్ఎస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారు కూడా మద్దతు తెలుపుతారు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విసిరిన సవాలును తాను స్వీకరిస్తున్నానని, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇటీవల జగన్ మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైసీపీ సిద్ధంగా ఉందని, టీడీపీ మద్దతు ఇస్తుందా? అని అడిగిన విషయం తెలిసిందే. ఒకవేళ అవిశ్వాస తీర్మానం టీడీపీ పెడితే మద్దతు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జగన్ అన్నారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు పార్ట్‌నర్ గా అభివర్ణిస్తూ, తాము అవిశ్వాసం పెడితే మద్దతు ఇవ్వగలరా? అని పవన్‌ను జగన్ ప్రశ్నించారు.
దీనిపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఈ రోజు హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయంలో మాట్లాడుతూ... అందరి మద్దతు వచ్చేలా తాను చేస్తానని, పార్లమెంటరీ గైడ్ లైన్స్ ప్రకారం ఒక్క ఎంపీ కూడా అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని తెలిపారు. అనంతరం 50 మంది ఎంపీల మద్దతు కూడగట్టొచ్చని అన్నారు. తాము కోరితే టీఆర్ఎస్ పార్టీ నేతలు, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ లాంటి వారు కూడా మద్దతు తెలుపుతారని వ్యాఖ్యానించారు. వారందరూ కలిస్తే ఏకంగా 80 మంది మద్దతు సైతం వస్తుందని చెప్పారు.
తన వంతు సాయం ఏం చేయమన్నా చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. నిన్న జగన్ సవాలు విసిరారు కాబట్టి తాను సమాధానం చెబుతున్నానని అన్నారు. అఖిల పక్షాన్ని తాను ముందుకు తీసుకొస్తానని వ్యాఖ్యానించారు. కావాలంటే కర్ణాటక, తమిళనాడు వెళతానని, అక్కడి పార్టీలతో కూడా మాట్లాడతానని పేర్కొన్నారు. ఇది తెలుగు జాతి సమస్య అని, పార్టీల సమస్య కాదని చెప్పుకొచ్చారు. అలాగే తాను మార్చి 4న ఢిల్లీకి సైతం వస్తానని పేర్కొన్నారు.