BJP: అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా వెళతా: చంద్రబాబు
- అది చివరి ప్రయత్నంగా మాత్రమే ప్రయోగించాలి
- అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలి
- అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని నేను ఎన్నడూ అనలేదు
- ప్రత్యేక హోదా ఇస్తారో, ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలి
గతంలో రాజీనామా చేస్తామన్న వైసీపీ ఇప్పుడు డ్రామాలు ఆడుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎంపీలు తక్కువగా ఉన్న కారణంగా మనం అవిశ్వాస తీర్మానం పెట్టలేమని, అయితే, అవసరమైతే అన్ని పార్టీల సాయం తీసుకుని అవిశ్వాసం దిశగా వెళతానని అన్నారు. కానీ, అది చివరి ప్రయత్నంగా మాత్రమే ప్రయోగించాలని చెప్పారు.
అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 54 మంది ఎంపీలు ఉండాలని చంద్రబాబు చెప్పారు. తాను అవిశ్వాస తీర్మానం వల్ల లాభం లేదని అన్నానని కొందరు అంటున్నారని, తాను అలా అనలేదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, అన్ని పోరాటాలు చేసిన తరువాత ఆ ప్రయత్నం చేయాలని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తారో ప్యాకేజీ నిధులు ఇస్తారో కేంద్ర ప్రభుత్వం తేల్చుకోవాలని అన్నారు.
తాము కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు చెప్పారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తారనే బీజేపీతో కలిశామని చెప్పారు. ఇన్నేళ్లుగా న్యాయం జరగలేదని అన్నారు. ఆనాడు రాష్ట్రాన్ని హేతుబద్ధంగా విభజించలేదని చెప్పారు.