Ramgopal varma: పోలీసులను తప్పుదోవ పట్టించిన వర్మ.. అరెస్ట్‌కు రెడీ అవుతున్న పోలీసులు?
- సోమవారం రెండో విడత విచారణకు హాజరుకానున్న ఆర్జీవీ
- ‘జీఎస్టీ’ డౌన్లోడ్, అప్లోడ్ విషయంలో దొరికిపోయిన వర్మ
- తమను తప్పుదోవ పట్టించాడని భావిస్తున్న పోలీసులు
‘గాడ్ సెక్స్ ట్రూత్’ (జీఎస్టీ) వివాదంపై ఇటీవల పోలీసుల ఎదుట విచారణకు హాజరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ అరెస్ట్ తథ్యమని తెలుస్తోంది. దాదాపు మూడున్నర గంటలపాటు జరిగిన విచారణలో పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలను దాటవేశాడు. ‘జీఎస్టీ’కి, తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన వర్మ.. దానిని ‘స్కైప్’ ద్వారా చిత్రీకరించినట్టు పోలీసులకు చెప్పాడు.
అలాగే పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇచ్చాడు. దీంతో వర్మ తమను తప్పుదోవ పట్టించాడని పోలీసులు భావిస్తున్నారు. ‘జీఎస్టీ’ని విదేశాల్లో చిత్రీకరించినట్టు చెప్పిన వర్మ.. డౌన్లోడ్, అప్లోడ్ విషయంలో అడ్డంగా దొరికిపోయినట్టు చెబుతున్నారు. దీంతో సోమవారం విచారణ అనంతరం అరెస్ట్ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి.
విచారణ అనంతరం బయటకు వచ్చిన వర్మ ట్విట్టర్ ద్వారా చేసిన వ్యాఖ్యలను కూడా పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. శుక్రవారం రెండో దఫా విచారణకు ఆర్జీవీ హాజరుకావాల్సి ఉండగా సోమవారం హాజరవుతానని చెప్పాడు. ఆ రోజు ఆయనను అదుపులోకి తీసుకోవడం ఖాయమని పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.
వర్మ ల్యాప్‌టాప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్ తెలిపారు. వర్మ ఇచ్చిన సమాధానాలపై అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసుకోవడానికే రెండోసారి విచారణకు పిలిచినట్టు ఆయన తెలిపారు.