Arunachal Pradesh: ఆగ్రహం కట్టలుతెగితే... ఇద్దరు అత్యాచార నిందితులను పోలీస్ స్టేషన్ లాకప్ నుంచి లాక్కొచ్చి కొట్టి చంపిన ప్రజలు!
- అరుణాచల్ ప్రదేశ్ లో కలకలం
- చిన్నారిపై నిందితుల అత్యాచారం
- ఆపై తల నరికిన నిందితులు
- గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు
ఇద్దరు అత్యాచార నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి లాకప్ లో ఉంచగా, అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న ప్రజలు మూకుమ్మడిగా దాడి చేసి, వారిని బయటకు లాక్కొచ్చి కొట్టి చంపిన ఘటన అరుణాచల్ ప్రదేశ్ లోహిత్ జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. తేయాకు తోటల్లో పనిచేసే సంజయ్ సోబోర్ (30), జగదీష్ లోహార్ (25)లు ఈనెల 12వ తేదీన ఐదున్నరేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి, దారుణంగా హత్య చేశారని అభియోగం.
పాప కనిపించడం లేదని పోలీసు కేసు పెట్టిన తల్లిదండ్రులు, ఆపై ఆమెకోసం వెతుకుతుండగా, వాక్రో పోలీస్ స్టేషన్ పరిధిలోని నామ్గో గ్రామం సమీపంలో తలతెగిపడిన స్థితిలో పాప కనిపించింది. ఈ కేసు విచారణలో భాగంగా సంజయ్, జగదీష్ లను అనుమానించిన పోలీసులు, వారిని అరెస్ట్ చేసి విచారించగా, తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు.
ఇక ఈ విషయం బయటకు తెలియడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా స్టేషన్ పైకి వెళ్లిన వందలాది మందిని పోలీసులు నిలువరించలేకపోయారు. ఈ ఘటన తరువాత గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, నిరసనకారులను అడ్డుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలపై ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశామని అధికారులు తెలిపారు.