somu feerraju: విభజన చట్టంలో పేర్కొన్న వాటికి 85 శాతం నిధులిచ్చాం..15 శాతమే బ్యాలెన్స్ ఉంది!: సోము వీర్రాజు
- కేంద్రం నిధులు కేటాయించలేదన్నది పూర్తిగా అవాస్తవం
- సాక్షాత్తూ చంద్రబాబే గతంలో కేంద్రాన్ని ఇంతకు మించి అడగలేమన్నారు
- పోలవరం ఖర్చు భరిస్తామని కేంద్రమే పార్లమెంటులో ప్రకటన చేసింది
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో పేర్కొన్నట్లుగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, కేవలం 15 శాతం నిధులు మాత్రమే ఇంకా ఇవ్వాల్సి ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. రాజమండ్రిలో జరిగిన బీజేపీ మహిళా మోర్చా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పథకాల్లో 80 శాతం కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్నవేనని స్పష్టం చేశారు.
పోలవరం ఖర్చు మొత్తం కేంద్రమే భరిస్తుందని పార్లమెంట్ లో స్పష్టం చేశామని ఆయన గుర్తు చేశారు. కేంద్రం సహకరిస్తోందంటూ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల వార్తల క్లిప్పింగ్స్ చూపించిన ఆయన, ఏపీని కేంద్రం ఆదుకుంటోందని, కేంద్రాన్ని ఇంతకు మించి అడగలేమని సాక్షాత్తూ ముఖ్యమంత్రే గతంలో చెప్పారని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నట్లుగా కేంద్రం నిధులు కేటాయించలేదన్నది పూర్తిగా అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు.