cpi: డ్రామాలు ఆడితే బీజేపీ, టీడీపీలకు మిగిలేది బోడి గుండే!: సీపీఐ నారాయణ
- ప్యాకేజీ లాంటి భిక్షాటన కోసం అయితే మేము కలవం
- ప్రత్యేక హోదాపై అయితే కలిసి వస్తాం
- ‘కేంద్రం’పై మొదట అవిశ్వాస తీర్మానం పెట్టాల్సింది టీడీపీయే
- తెలంగాణకూ అన్యాయం జరిగింది : సీపీఐ నారాయణ
ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై పోరాడేందుకు అఖిలపక్షం ఏర్పాటుపై చర్చిస్తామని సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ నారాయణ స్పందిస్తూ, అఖిలపక్షంపై చర్చిస్తామని చంద్రబాబు చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని, ప్యాకేజీ లాంటి భిక్షాటన కోసం అయితే ‘అఖిలపక్షం’తో తాము కలవమని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదాపై అయితే కలిసి వస్తామని, డ్రామాలు ఆడితే బీజేపీ, టీడీపీలకు మిగిలేది బోడి గుండేనని విమర్శించారు.
ఏపీ ప్రజలను బీజేపీ నేతలు వెంట్రుకతో పోలుస్తూ అవమానించారని మండిపడ్డారు. ఏపీకే కాదు తెలంగాణ రాష్ట్రానికి కూడా అన్యాయం జరిగిందని కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టే విషయంలో తెలంగాణ ఎంపీలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వంపై మొదట అవిశ్వాస తీర్మానం పెట్టాల్సింది తెలుగుదేశం పార్టీయేనని ఈ సందర్భంగా నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలపై ఆయన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీది రిటైల్ అవినీతి అయితే, బీజేపీది హోల్ సేల్ అవినీతి అని ఆరోపించారు.