Pawan Kalyan: ఆ విషయం అడిగితే పవన్ కల్యాణ్ ఓ నవ్వు నవ్వేశారు!: ఉండవల్లి అరుణ్ కుమార్
- జేఎఫ్సీలోకి ఆహ్వానించే ముందు పవన్ నాకు ఫోన్ చేయలేదు
- ఈ విషయమై పవన్ ని అడిగాను
- ‘మీరు సాయపడతారనే నమ్మకం నాకు ఉంది’ అని పవన్ అన్నారు : ఉండవల్లి
లెక్కల విషయంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఏర్పడ్డ గందరగోళానికి సంబంధించి తెరదించేందుకు ఏర్పాటైన సంయుక్త నిజనిర్థారణ కమిటీ (జేఎఫ్సీ) లో ఎటువంటి అభిప్రాయభేదాలు లేవని, ఏకాభిప్రాయంతోనే ఉందని ఓ ప్రశ్నకు సమాధానంగా సీనియర్ రాజకీయవేత్త ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. ఏబీఎన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఉండవల్లి మాట్లాడుతూ, జేఎఫ్సీలో ఎవరెవరున్నారో తెలుసుకుని, ఇష్టపడిన తర్వాతే అందరూ వచ్చారని చెప్పారు. జేఎఫ్సీ కమిటీ, అజెండా గురించి చెప్పిన తర్వాతే అందులో చేరారని, ఎవరి మధ్య భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అందరూ కలిసి ఒకే రకమైన నివేదికను సమర్పిస్తారని, అందులో అన్నీ నిజాలే ఉంటాయని అన్నారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని ఉండవల్లి ప్రస్తావించారు. జేఎఫ్సీలోకి ఆహ్వానించే ముందు పవన్ కల్యాణ్ అందరికీ ఫోన్ చేశారు కానీ, తనను సంప్రదించకుండానే తన పేరును పవన్ ప్రకటించారని అన్నారు. ఆ తర్వాత పవన్ ని ఈ విషయమై అడిగానని చెప్పారు. ‘నన్ను పిలవమని ఎవరు చెప్పారు?’ అని పవన్ ని అడిగితే.. ఓ నవ్వు నవ్వేసి.. ‘ఇది నా సొంత నిర్ణయం. మీరు సాయపడతారనే నమ్మకం నాకు ఉంది’ అని తనతో అన్న విషయాన్ని ఉండవల్లి గుర్తుచేసుకున్నారు. ఏదేమైనప్పటికీ, పవన్ తనను నమ్మి అప్పజెప్పిన అసైన్ మెంట్ కు వంద శాతం న్యాయం చేస్తానని ఉండవల్లి మరోమారు స్పష్టం చేశారు.