Nirav Modi: నీరవ్ మోదీ కేసులో ముఖేష్ అంబానీ బంధువు విపుల్ అంబానీ అరెస్ట్
- బ్యాంకులకు టోకరా వేసిన నీరవ్ మోదీ
- ఫైర్ స్టార్ డైమండ్ అధికారి విపుల్ అంబానీ అరెస్ట్
- మరో నలుగురు కూడా
పంజాబ్ నేషనల్ బ్యాంకు సహా 30కి పైగా బ్యాంకులకు వేల కోట్లకు టోకరా వేసిన నీరవ్ మోదీ కుంభకోణంలో ఇప్పటికే గీతాంజలి గ్రూప్ సీఎఫ్ఓ కపిల్ ఖండేల్వాల్, మేనేజర్ నితిన్ షాహి సహా పలువురిని అరెస్ట్ చేసిన సీబీఐ, తాజాగా, ఆయనకు సహకరించారన్న ఆరోపణలపై నీరవ్ మోదీ అనుబంధ 'ఫైర్ స్టార్ డైమండ్' ఆర్థిక విభాగం ప్రెసిడెంట్ విపుల్ అంబానీని అదుపులోకి తీసుకుంది. ఆయనతో పాటు మరో నలుగురిని కూడా అరెస్ట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి విపుల్ బంధువే.
ఈ కేసులో ఇప్పటివరకూ నీరవ్ కంపెనీల్లో పని చేస్తున్న 8 మందిని, గీతాంజలి గ్రూప్ లో 10 మంది అధికారులను విచారించిన తరువాత విపుల్ సహా కొందరిని అరెస్ట్ చేశామని సీబీఐ అధికారులు పేర్కొన్నారు. నీరవ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ కవితా మన్కికర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అర్జున్ పాటిల్ తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇదిలావుండగా, నీరవ్ కేసును ప్రత్యేక దర్యాఫ్తు బృందం ఏర్పాటు చేసి విచారణ జరిపించాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరపనుంది.