USA: విచ్చలవిడిగా గన్ కల్చర్ ఎఫెక్ట్... డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు!
- 'బంప్ స్టాక్స్' అమ్మకాలపై నిషేధం
- సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ కు ఉపకరణాలు లభించవు
- త్వరలోనే ఉత్తర్వులు అమలులోకి వస్తాయన్న ట్రంప్
అమెరికాలో విచ్చలవిడిగా గన్ కల్చర్ పెరిగిపోతుండటం, చిన్న చిన్న కారణాలకు కూడా తుపాకులు వాడుతూ హత్యలు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూ ఉండటం, ఉగ్రవాదులతో సమానంగా యూఎస్ పౌరులు విచక్షణారహితంగా కాల్పులకు దిగుతుండటంతో దేశవ్యాప్తంగా తుపాకులపై విమర్శలు పెరుగుతున్న వేళ, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దేశంలో తుపాకుల అమ్మకాలపై ఆంక్షలను విధించారు.
ఇటీవలి ఫ్లోరిడా స్కూల్ మారణకాండ తరువాత, లక్షలాది మంది ప్రజలు తుపాకుల సంస్కృతి వద్దని నినదిస్తుండడంతో ట్రంప్ కొత్త నిర్ణయాలు ప్రకటించారు. గన్ 'బంప్ స్టాక్స్'పై నిషేధం విధిస్తున్నట్టు ఆయన తెలిపారు. సెమీ ఆటోమేటిక్ రైఫిల్స్ కు సంబంధించిన ఉపకరణాలు ఇకపై మార్కెట్లో విక్రయించబోమని స్పష్టం చేశారు. ఈ ఉత్తర్వులు త్వరలోనే అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. సెమీ ఆటోమేటిక్ తుపాకులను కొనుగోలు చేసి వాటిని ఆటోమేటిక్ చేసే 'బంప్ స్టాక్స్' జోడించి, నిమిషానికి 50 బులెట్లను కూడా కాల్చగలిగేలా మార్చవచ్చన్న సంగతి తెలిసిందే.