Krishna Nandan Prasad Verma: స్లిప్పర్స్ తో వస్తేనే ఎంట్రీ... విద్యార్థులకు బీహార్ సర్కార్ కొత్త ఎగ్జామ్ రూల్!
- పదో తరగతి విద్యార్థులకు బీఎస్ఈబీ కొత్త ఆదేశం
- చెప్పులతోనే ప్రవేశిస్తున్న స్టూడెంట్లు
- నిష్పాక్షికంగా పరీక్షల నిర్వహణకే ఈ నిర్ణయం
బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బీఎస్ఈబీ) పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సరికొత్త నిబంధన విధించింది. షూలు, సాక్సులు తొడుక్కుని వస్తే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పొరపాటున షూలు వేసుకున్న విద్యార్థులను పరీక్షా కేంద్రాల వద్ద ఉన్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. దాంతో వారు చెప్పులతోనే లోపలికి ప్రవేశిస్తున్నారు.
పరీక్షలు రాసే విద్యార్థులు షూలలో స్లిప్స్ పెట్టుకుని వచ్చి, ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకే బీఎస్ఈబీ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి కృష్ణ నందన్ ప్రసాద్ వర్మ మాట్లాడుతూ...ఈ నోటిఫికేషన్ ద్వారా ఈ ఏడాది పరీక్షలు స్వేచ్ఛగానూ, నిష్పాక్షికంగానూ, పారదర్శకంగానూ జరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పరీక్షల నిర్వహణ విషయంలో బీఎస్ఈబీ తీసుకొస్తున్న నిబంధనలు బాగున్నాయని ఆయన చెప్పారు. కష్టపడి చదివితేనే ఉత్తీర్ణులు కాగలమనే విధంగా విద్యార్థుల్లో మానసిక పరివర్తన రావడానికి ఇలాంటి నిబంధనలు దోహదం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే విపక్ష పార్టీలు మాత్రం ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుబడుతున్నాయి. బీఎస్ఈబీ ఇలాంటి నిబంధనలతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావడం ఆపేయాలని మాజీ విద్యా శాఖ మంత్రి అశోక్ చౌదరీ డిమాండ్ చేశారు.