kamal hasan: తమిళనాడులో కమల్ పార్టీకి రాజకీయంగా పెద్దగా అవకాశాల్లేవు: తేలిగ్గా తీసిపారేసిన కాంగ్రెస్ సీనియర్ నేత
- అన్నాడీఎంకే లేదా డీఎంకేతో ఇతర ప్రాంతీయ పార్టీలు కలవాల్సిందే
- లేదంటే రాణించలేవు
- అన్నాడీఎంకే పతనమవుతుందని కమల్ భావన
- అది జరుగుతుందనుకోవడం లేదు
- మొయిలీ అభిప్రాయాలు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కమల్ పార్టీపై నీళ్లు చల్లారు. తమిళనాడులో కమలహాసన్ పార్టీ రాజకీయంగా ఎదిగేందుకు పెద్దగా అవకాశం లేదన్నారు. అవకాశాలు చాలా పరిమితమని చెప్పారు. తమిళనాడు రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ గా మొయిలీ సుదీర్ఘ కాలం పనిచేశారు. తమిళ రాజకీయాలపై మంచి అవగాహన కలిగిన ఆయన మాటల్ని కొట్టిపారేయడానికి వీలులేదు.
ఇక తమిళనాడు రాజకీయాలను ఎప్పటినుంచో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు శాసిస్తున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నేటికీ అక్కడ రాణించలేకపోతున్నాయి. మరోవైపు సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కమలహాసన్ రాజకీయ రాణింపుపై అప్పుడే ప్రశ్నలు మొదలయ్యాయి.
‘‘ప్రాంతీయంగా ప్రధాన పార్టీలుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేతో కలిస్తే తప్ప ఇతర ప్రాంతీయ పార్టీలకు తమిళనాడులో పెద్దగా చోటు ఉంటుందని నేను అనుకోవడం లేదు. కమలహాసన్ పార్టీకి అవకాశాలు చాలా పరిమితం. అన్నాడీఎంకే పతనం అవుతుందని, తాను ఆ స్థానాన్ని భర్తీ చేస్తానని కమల్ భావిస్తున్నారు. ఇది జరుగుతుందని నేను అనుకోవడం లేదు’’ అని మొయిలీ పేర్కొన్నారు. తమిళనాడులో డీఎంకేతో కలసి కాంగ్రెస్ బలంగానే ఉందని, రాష్ట్రంలో తన బలాన్ని పెంచుకుంటుందని అన్నారు. కమలహాసన్ తన పార్టీ పేరు, జెండా, విధానాలను నేడు ప్రకటించనున్న విషయం తెలిసిందే.