Venkaiah Naidu: పారికర్ బాగానే వున్నారు.. మరొకరు సీఎం అవుతారని వార్తలు రాయడం ఘోరం!: వెంకయ్యనాయుడు
- కొన్ని రోజులుగా ఆసుపత్రిలో గోవా సీఎం మనోహర్ పారికర్
- మనోహర్ పారికర్ బాగానే ఉన్నారు
- జర్నలిజం అంటే సంచలనాలకు దూరంగా ఉండాలి
- విలువలు, ప్రమాణాలు పాటించాలి- వెంకయ్య
గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో వున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమయితే ఆయనను మెరుగైన వైద్యం కోసం అమెరికాకు తరలిస్తామని కూడా బీజేపీ ప్రకటించింది. అయితే, ఆయనపై మీడియా రాస్తోన్న వార్తల పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రోజు ఢిల్లీలో ప్రముఖ సాహితీ వేత్త ఎన్ఆర్ చందూర్-జగతి జర్నలిస్టు అవార్డు 2018ని ప్రముఖ జర్నలిస్టు, గిజ్మోడో మీడియా గ్రూప్ సీఈవో రాజు నరిశెట్టి (అమెరికా)కు అందించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... లోక కల్యాణం కోసమే జర్నలిజం కృషి చేయాలని అన్నారు. పెద్ద కుంభకోణాలను బయటపెట్టిన ఘనత జర్నలిస్టులదేనని తెలిపారు.
జర్నలిజంలో విలువలు, ప్రమాణాలు పాటించాలని, పొరపాట్లు అంగీకరించినప్పుడే విశ్వసనీయత పెరుగుతుందని వ్యాఖ్యానించారు. గోవా సీఎం మనోహర్ పారికర్ బాగానే ఉన్నారని ఆయన చెప్పారు. ఆయన చనిపోతే, మరొకరు సీఎం అవుతారని కొందరు వార్తలు రాయడం ఘోరమైన విషయమని చెప్పారు. జర్నలిజం అంటే సత్యానికి దగ్గరగా ఉండాలని, సంచలనాలకు దూరంగా ఉండాలని చెప్పారు.