Tollywood: ప్రముఖ తెలుగు నిర్మాతపై జీఎస్టీ కేసు నమోదు.. దక్షిణ భారతదేశంలో నమోదైన తొలి కేసు ఇదే!
- పలు విభాగాల నుంచి జీఎస్టీ కింద రూ.7 కోట్లు వసూలు చేసిన నిర్మాత
- ప్రభుత్వానికి మాత్రం జమ చేయలేదు
- ఆధారాలతో గుర్తించిన అధికారులు
ప్రముఖ తెలుగు నిర్మాతపై హైదరాబాద్ జీఎస్టీ కమిషనర్ కార్యాలయం అధికారులు కేసు నమోదు చేశారు. సినిమాల నిర్మాణ సమయంలో పలు విభాగాల నుంచి జీఎస్టీ కింద రూ.7 కోట్లు వసూలు చేసిన సదరు నిర్మాత, ఆ మొత్తాన్ని ప్రభుత్వానికి మాత్రం జమ చేయలేదు. దీంతో, ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ నిర్మాత కార్యాలయాలపై కేంద్ర జీఎస్టీ అధికారులు నిన్న దాడులు నిర్వహించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే, ఇందుకు సంబంధించి, సదరు నిర్మాత నిన్న రూ.2 కోట్లు చెల్లించారని, మిగిలిన రూ.5 కోట్లు చెల్లించేందుకు వారం రోజుల గడువు కావాలని ఆ నిర్మాత కోరారని అధికారులు తెలిపారు. గడువులోగా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడంతో పాటు తదుపరి చర్యలు తీసుకుంటామని జీఎస్టీ హైదరాబాద్ అధికారులు పేర్కొన్నారు.
కాగా, సినీ నిర్మాణానికి సంబంధించి చెల్లింపుల సమయంలో నటీనటులు, టెక్నీషియన్స్, స్టూడియో, ల్యాబ్ ల నుంచి 12 శాతం పన్నును నిర్మాతలు మినహాయించుకుంటారు. ఈ పన్నును జమ చేయాల్సిన బాధ్యత నిర్మాతపైనే ఉంటుంది.
వసూలు చేసిన పన్నును చెల్లించకుంటే కఠిన చర్యలు తప్పవు
వసూలు చేసిన పన్నును ప్రభుత్వానికి చెల్లించకపోవడం జీఎస్టీ చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని అధికారులు పేర్కొన్నారు.ఈ చట్టం కింద ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చునని, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయడంతో పాటు చెల్లించాల్సిన మొత్తానికి వంద శాతం జరిమానా విధిస్తామని తెలిపారు.
దక్షిణ భారతదేశంలో ఈ తరహాలో నమోదైన మొదటి కేసు ఇదే!
జీఎస్టీ వసూలు చేసి ప్రభుత్వానికి జమ చేయని నిర్మాతలపై నమోదైన కేసుల్లో ఇదే మొదటిదని, దక్షిణ భారతదేశంలో ఈ తరహాలో నమోదైన మొదటి కేసుగా దీనిని చెప్పొచ్చని అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన జులై నుంచి సదరు నిర్మాత తీసిన సినిమాలకు సంబంధించి పలు విభాగాల నుంచి చెల్లింపుల సమయంలో జీఎస్టీ మినహాయించుకున్నట్టు చెప్పారు. ఈ నిర్మాత వ్యవహారంపై వారం రోజులుగా దృష్టి సారించిన అధికారులు, ఆధారాలతో సహా గుర్తించి దాడులు చేయడం గమనార్హం.