CBI: విచారణలో 'రోటామాక్' నిందితుల మౌనం...అరెస్ట్!
- నిందితులను మూడు రోజుల పాటు విచారించిన సీబీఐ
- సహకరించకపోవడంతో తండ్రీతనయుల అరెస్టు
- స్థిరాస్తుల జప్తు, బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన ఐటీ
బ్యాంకులకు రూ.3695 కోట్ల రుణాన్ని ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కలాల తయారీ కంపెనీ 'రోటామాక్' అధినేత విక్రమ్ కొఠారిని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు చెందిన బ్యాంక్ సెక్యూరిటీస్ అండ్ ఫ్రాడ్ సెల్ అధికారులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. ఆయనతో పాటు ఆయన తనయుడు రాహుల్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం వారిద్దరినీ న్యూఢిల్లీలోని తమ ప్రధాన కార్యాలయానికి పిలిపించామని...మూడు రోజుల పాటు విచారించినా వారు విచారణకు సహకరించకపోవడంతో వారిద్దరినీ అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.
బ్యాంకులను ఏ విధంగా మోసం చేసిందీ, మోసం ద్వారా తమ బ్యాంకు ఖాతాలకు చేరిన సొమ్మును ఎలా ఖర్చు చేసిందీ వారు తమకు చెప్పలేదని అధికారులు తెలిపారు. 2008 నుంచి రోటామాక్ కంపెనీ ఏడు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు అసలు, వడ్డీ కలిపి రూ.3695 కోట్లకు చేరుకుందని వారు చెప్పారు. వారిద్దరినీ నేడు సీబీఐ కోర్టులో హాజరుపరుస్తామన్నారు. కాగా, సీబీఐ ఇప్పటికే ఢిల్లీ, కాన్పూర్‌లలోని వారి ఇళ్లను సీల్ చేసింది. మరోవైపు పన్ను ఎగవేతకు సంబంధించి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు కూడా నిందితుల స్థిరాస్తులను జప్తు చేయడంతో పాటు వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు.