Ramayana: రూ.500 కోట్లతో రామాయణం... షూటింగ్ కోసం యూపీ ప్రభుత్వంతో ఎంఓయూ!
- యూపీ 'ఫిల్మ్ బంధు'తో ఎంఓయూ
- నిర్మాతలుగా అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా
- మూడు భాషల్లో 3డీ టెక్నాలజీతో షూటింగ్
చాలాకాలంగా 'రామాయణం' తెరకెక్కనుందనే వార్త వినబడుతూనే ఉంది. ఆ శుభముహూర్తం ఎప్పుడొస్తుందా అని పురాణ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును అద్భుతంగా తెరకెక్కించేందుకు ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రా కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మూడు భాషల్లో 3డీ టెక్నాలజీతో ఇది రూపొందనుంది. ఉత్తర్ ప్రదేశ్లో ఈ సినిమా నిర్మాణానికి సంబంధించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన చలనచిత్ర విభాగం 'ఫిల్మ్ బంధు'తో నిర్మాతలు తాజాగా ఓ అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకున్నారు.
యూపీ పెట్టుబడిదారుల సదస్సు-2018 వేదికగా గురువారం ఈ ఒప్పందం కుదిరింది. ఈ మేరకు నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన ఓ ప్రకటన విడుదల చేశారు. మధు గతంలో 'గజినీ' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. రామాయణం చిత్రానికి సంబంధించి త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.