rajanikanth: నా అభిమానులకు పాఠాలు చెప్పక్కర్లేదు... వారే మీకు పాఠాలు చెప్పగలరు!: రజనీకాంత్
- విమర్శలు గుప్పించే రాజకీయ నాయకులకు రజనీ హితవు
- 32 ఏళ్ల అనుభవం కలిగిన అభిమాన సంఘాలు
- మేము చేయాల్సిందల్లా పార్టీని బలోపేతం చేయడమే
తన అభిమానులకు రాజకీయ పాఠాలు నేర్పక్కర్లేదని తమిళ రాజకీయ పార్టీల నేతలకు ప్రముఖ నటుడు రజనీకాంత్ ఘాటుగా సమాధానం చెప్పారు. చెన్నైలో ప్రజా సంఘాలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన అభిమానులు రాజకీయనాయకులకే పాఠాలు చెప్పగల సమర్థులని తెలిపారు.
తన పార్టీ 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి ఉద్భవిస్తున్న విషయాన్ని రాజకీయ నాయకులు గుర్తించాలని ఆయన సూచించారు. తాము చేయాల్సిందల్లా తమ పార్టీని బలోపేతం చేయడమేనని ఆయన అన్నారు. జిల్లా ఇన్ ఛార్జీలను నియమించిన తరువాత తాను రాష్ట్ర పర్యటన చేపడతానని రజనీకాంత్ తెలిపారు.
కాగా, తన సహనటుడు కమలహాసన్ నిర్వహించిన 'మక్కల్ నీది మయ్యం' పార్టీ అరంగేట్ర సమావేశం చూశానని అన్నారు. కమల్ ది, తనది దారులు వేరైనా లక్ష్యం ఒకటేనని ఆయన చెప్పారు. తమిళులకు మంచి చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.