Drunken Drive: 'ఇయర్ ఫోన్' డ్రైవింగ్ పై హైదరాబాద్ పోలీసుల ఉక్కుపాదం... 10 మందికి జైలు శిక్ష.. ఇదేం పనంటూ తీవ్ర మనోవేదన!
- ఇప్పటివరకూ డ్రంకెన్ డ్రైవ్ పై ఉక్కుపాదం
- ఇక ఇయర్ ఫోన్ డ్రైవింగ్ చేసినా నేరమే
- తొలి రోజే 9 మందికి జైలు శిక్ష
- కోర్టు హాల్లో కుప్పకూలిన ఇద్దరు ఉద్యోగులు
ఇప్పటివరకూ డ్రంకెన్ డ్రైవ్ పై ఉక్కుపాదం మోపుతూ వస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, తాజాగా ఇయర్ ఫోన్ డ్రైవింగ్ పై దృష్టిని సారించగా, తొలి రోజు 10 మంది జైలుకు వెళ్లడం, పోలీసుల వైఖరిపై విమర్శలు తెస్తోంది. వాహనదారుల్లో కనీస అవగాహన కల్పించే పనులు చేయకుండా, కౌన్సెలింగ్ ఇవ్వకుండా, చెవిలో ఇయర్ ఫోన్ పెట్టుకుని వెళుతున్నారని ఆరోపిస్తూ, వారిని కోర్టు ముందుకు తీసుకెళ్లడం, రూ. 1000 జరిమానాతో పాటు జైలుకు పంపాలని న్యాయమూర్తి తీర్పు ఇవ్వడంతో వాహనదారులు తీవ్ర మనోవేదనకు గురై కోర్టు హాల్ లోనే కుప్పకూలారు.
కాగా, ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఇయర్ ఫోన్ డ్రైవింగ్ ను నేరంగా పరిగణిస్తూ కొత్త నిబంధన తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, దీనిపై నగర వాసుల్లో అవగాహన పెంచేందుకు పోలీసులు ఏమీ చేయలేదు. గోషామహల్ పోలీసులకు మొత్తం 19 మంది పట్టుబడగా, వారికి స్పెషల్ కోర్టు జైలు శిక్షను విధించింది. పట్టుబడిన వారిలో ఇద్దరు ఉద్యోగులు తమకు శిక్ష ఖరారైన సంగతి తెలుసుకుని హతాశులై కుప్పకూలారు. చెవిలో ఇయర్ ఫోన్ ఉందని జైలుకు పంపడం ఏంటని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, తాము నిబంధనల ప్రకారం కేసులు పెట్టామని, స్పెషల్ డ్రైవ్ గురించి ముందే వెల్లడించామని ట్రాఫిక్ పోలీసులు అంటుండగా, ఏసీ గదుల్లో కూర్చుని ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయాన్ని అప్పటికప్పుడు పోలీసులు అత్యుత్సాహంతో అమలు చేశారన్న విమర్శలు పెరుగుతున్నాయి.