Christians: హిందువులు పిల్లల్ని కంటూనే ఉండాలి...బీజేపీ ఎంఎల్ఏ వివాదాస్పద వ్యాఖ్యలు
- జనాభా నియంత్రణ చట్టం అమలయ్యేంత వరకు కంటూనే ఉండాలి
- నలుగురైదుగురు పిల్లలు కావాలని నా భార్యతో చెప్పా
- ముజఫర్‌నగర్ బహిరంగ సమావేశంలో ఎంఎల్ఏ సైనీ వ్యాఖ్యలు
యూపీలోని ఖతౌలీ నియోజకవర్గం బీజేపీ ఎంఎల్ఏ విక్రమ్ సైనీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జనాభా నియంత్రణకు ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చేంత వరకు హిందువులు పిల్లలను కంటూనే ఉండాలని ఆయన అన్నారు. తన భార్యకు ఇదే విషయాన్ని చెప్పానని ఆయన వ్యాఖ్యానించారు. జనాభా నియంత్రణపై ముజఫర్‌నగర్‌లో జరిగిన ఓ బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడారు.
''ఇద్దలు పిల్లలు ముద్దు' పాలసీ మనకు సమ్మతమే. కానీ ఇతరులు దానిని పాటించడం లేదు. చట్టం అందరికీ సమానమే. హిందువులు పిల్లల్ని కనడం ఆపరాదు. మనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా...మూడో బిడ్డ ఎందుకని నా భార్య నన్ను అడిగింది. కానీ మనకి నలుగురైదుగురు పిల్లలు కావాలని ఆమెతో నేను అన్నాను" అని సైనీ చెప్పారు.
ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ నూతన సంవత్సర వేడుకలు, వేలంటైన్స్ డే క్రైస్తవుల పండుగ అని, దానిని హిందువులు చేసుకోరాదని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక హిందూస్థాన్ హిందువులది... ముస్లింలు పాకిస్థాన్‌కు వెళ్లిపోండంటూ గత నెలలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.