Mehul Choksi: 'మీ దారి మీరు చూసుకోండి'.. ఉద్యోగులకు 'గీతాంజలి జెమ్స్' అధినేత సలహా
- బాకీలు, జీతాలు చెల్లించలేనని స్పష్టీకరణ
- ఆఫీసునూ నడిపించే స్థితిలో లేనని వెల్లడి
- వేరే ఉద్యోగాలు చూసుకోవాలని లేఖ ద్వారా వినతి
దాదాపు రూ.11,400 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల్లో ఒకరైన గీతాంజలి జెమ్స్ ప్రోమోటర్ మేహుల్ చోక్సీ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చారు. తాను జీతాలు చెల్లించలేనని, వేరే ఉద్యోగాలు చూసుకోవాలంటూ ఓ లేఖను విడుదల చేశారు.
"కేంద్ర దర్యాప్తు సంస్థలు కంపెనీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశాయి. ఇతర ఆస్తులనూ జప్తు చేశాయి. అందువల్ల మీకు చెల్లించాల్సిన బాకీలు గానీ లేదా భవిష్యత్తులో మీకు జీతాలు గానీ ఇచ్చే పరిస్థితిలో నేను లేను. ప్రస్తుతం నేను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాను. అందువల్ల మీరు వేరే ఉద్యోగాలు చూసుకోండి. ఆఫీసునూ నడిపించే పరిస్థితిలోనూ లేను. మరోవైపు దర్యాప్తు సంస్థల తీరూ బాగాలేదు. నాతో సంబంధమున్న వారెవరూ ఇబ్బంది పడకూడదన్నదే నా భావన. అందువల్ల మీరు ఏదైనా ఇతర ఉపాధి మార్గాలు చూసుకోండి" అని భారతదేశంలోని తమ ఉద్యోగులకు ఆయన ఓ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు వస్తున్నాయని, తానే తప్పూ చేయలేదని, అంతిమంగా సత్యమే గెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.