sridevi: కళ్లతో అన్ని భావాలను పలికించిన గొప్ప నటి!: శ్రీదేవి మరణంపై మురళీమోహన్ స్పందన
- తెల్లవారక ముందే ఆమె మరణవార్తతో దిగ్భ్రాంతికి గురయ్యా
- ఆమె దేశాన్ని ఏలుతుందని ఎప్పుడో అనుకున్నాం
- ఏ లోకంలో ఉన్నా... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి
సినీ ప్రపంచంలో ధ్రువతారగా వెలుగొందిన శ్రీదేవి... అందరినీ వదిలి నింగికెగశారు. ఈ సందర్భంగా ఆమెతో కలసి నటించిన మురళీమోహన్... ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 'మా బంగారక్క' అనే సినిమాలో తామిద్దరం కలసి తొలిసారి హీరోహీరోయిన్లుగా నటించామని ఆయన తెలిపారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఇద్దరం కలసి నటించామని చెప్పారు. ఆమె చాలా సరదాగా ఉండేవారని తెలిపారు.
బాలనటిగానే ఎంతో మంచి పేరు తెచ్చుకున్న ఆమె... హీరోయిన్ గా అగ్రస్థానానికి ఎదిగినా, అంతే ఒద్దికగా ఉండేవారని, డైరెక్టర్ ఏది చెబితే దాన్ని పాటించేవారని చెప్పారు. ఆమె సిన్సియారిటీ, నిబద్ధతను చూసిన తామంతా... ఏ రోజైనా శ్రీదేవి అగ్రనటిగా ఎదుగుతుందని, ఈ దేశాన్ని ఏలుతుందని అనుకున్నామని తెలిపారు. అలాంటి ఆమె తిరిగిరాలేని దూరాలకు వెళ్లిపోయిందనే వార్తను వినలేకపోతున్నామని, జీర్ణించుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సెట్లో ఉన్నప్పుడు ఆమె ఎంతో సరదాగా, గలగలా నవ్వుతూ ఉండేవారని... ఆమె ముఖంలో తాను ఏనాడూ కోపాన్ని కాని, బాధను కానీ చూడలేదని మురళీమోహన్ అన్నారు. ఆమెకు అగ్రనటిననే గర్వం ఏమాత్రం లేదని చెప్పారు. శ్రీదేవి కళ్లు అద్భుతమని... ఆ కళ్లతో ఆమె నవ్వగలదు, ఏడవగలదని... కళ్లతో అన్ని భావాలను పలికించిన గొప్ప నటి అని అన్నారు. ఆమె మరణ వార్తను యావత్ దేశం జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. తెల్లవారకముందే ఆమె మరణవార్తతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారని అన్నారు. అంతటి మహా మనిషి ఏ లోకంలో ఉన్నా... ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని చెప్పారు.
తాను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శ్రీదేవిని ఎక్కువగా కలుసుకోలేదని మురళీమోహన్ తెలిపారు. ఒక మూడు, నాలుగు సార్లు సినిమా ఫంక్షన్లలోనే కలుసుకున్నామని చెప్పారు. గత నాలుగేళ్లుగా ఆమెను కలవలేకపోయానని తెలిపారు.