Pawan Kalyan: శ్రీదేవి నటన చిరస్మరణీయం: పవన్ కల్యాణ్
- మరణవార్త తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యా
- నటిగా శ్రీదేవి ముద్ర చిత్రసీమలో సుస్థిరం
- 'బూచాడమ్మ బూచాడు' పాటలో ఆమె అభినయం అద్భుతం
- శోకసంద్రంలో సినీ పరిశ్రమలు
భారతీయ వెండితెరపై తనదైన ముద్రను వేసుకున్న శ్రీదేవి హఠాన్మరణం నమ్మలేనిదని ప్రముఖ హీరో, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఆమె మరణవార్త తెలియగానే దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆయన చెప్పారు. "అసమానమైన అభినయ ప్రతిభతో భారత ప్రేక్షకలోకం అభిమానాన్ని ఆమె చూరగొన్నారు. శ్రీదేవి ఇకలేరు అనే మాట నమ్మలేనిది. కానీ ఆమె చేసిన పాత్రలన్నీ చిరస్మరణీయాలే. ఆమె భౌతికంగా ఈ లోకాన్ని వీడినా నటిగా శ్రీదేవి ముద్ర చిత్ర సీమలో సుస్థిరం. ఆమె కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకుని నిలబడే మానసిక స్థైర్యాన్ని ఆ భగవంతుడు అందించాలని ప్రార్థిస్తున్నాను. తెలుగులో బడిపంతులు చిత్రంలో 'బూచాడమ్మ బూచాడు' అనే పాటలో ఆమె కళ్లు అటూ ఇటూ తిప్పుతూ పలికించిన హావభావాల్ని ప్రేక్షకులు ఎన్నటికీ మరిచిపోలేరు.
అదే విధంగా అన్నయ్యతో జగదేకవీరుడు అతిలోకసుందరి చిత్రంలో దేవకన్య ఇంద్రజగా ఆమె కనిపించిన తీరు, 'మానవా' అంటూ ఆమె చెప్పే సంభాషణలు కూడా అందరూ గుర్తు చేసుకునేవే. ఆమె అమాయకత్వపు నటన మరువలేనిది. కొంత విరామం తర్వాత హిందీలో ఇంగ్లీష్ వింగ్లీష్, మామ్ చిత్రాల ద్వారా శ్రీదేవి తన శైలి నటనను ఈ తరానికీ చూపించారు. శ్రీదేవి తన పెద్ద కుమార్తెను కథానాయికగా చిత్రసీమకి తీసుకువస్తున్న తరుణంలో ఆమె ఈ లోకాన్ని వీడిపోవడం బాధాకరం" అంటూ జనసేన పార్టీ తన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేరుతో సోషల్ మీడియాలో ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా, దుబాయిలో ఓ వివాహానికి హాజరైన శ్రీదేవి శనివారం రాత్రి 11.30 గంటలకు గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణంతో చలనచిత్ర పరిశ్రమలు మూగబోయాయి.