prashant koshor: మరోసారి బీజేపీ విజయానికి బాటలు వేయనున్న ప్రశాంత్ కిషోర్?... మోదీతో పలు మార్లు చర్చలు
- ప్రశాంత్ సేవల్ని వినియోగించుకోవాలని భావిస్తున్న మోదీ
- డీల్ కుదిరితే రానున్న ఎన్నికల్లో ప్రశాంత్ సేవలు
- ఇప్పటికైతే రాని స్పష్టత... త్వరలో తెలిసే అవకాశం
ఎన్నికల వ్యూహకర్త, 2014లో బీజేపీ భారీ విజయానికి పాటు పడిన ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే మరోసారి తన సేవల్ని కాషాయదళానికి అందించనున్నారా...? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. 2014 బీజేపీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన తర్వాత అమిత్ షాతో వచ్చిన విభేదాలతో పీకే ఆ పార్టీకి దూరం జరిగారు. ఆ తర్వాత కాలంలో ఆయన బిహార్ లో నితీష్ కుమార్ కు తన సేవలు అందించి విజయాన్ని బహుమానంగా అందించారు. ప్రశాంత్ కిషోర్ సక్సెస్ రేటు చూసి కాంగ్రెస్ పార్టీ యూపీ ఎన్నికల్లో ఆయన సేవలు తీసుకుంది. కానీ, బీజేపీ ప్రభ ముందు బొక్క బోర్లా పడింది. ఇక ఆ తర్వాత వైెసీపీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో సేవలు అందించేందుకు ప్రశాంత్ కిషోర్ టై అప్ అయ్యారు.
అయితే, ప్రశాంత్ కిషోర్ సేవల్ని మరోసారి ఉపయోగించుకోవాలని ప్రధాని మోదీ కోరుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి ప్రధాని, ప్రశాంత్ కిషోర్ మధ్య పలు మార్లు భేటీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఒకవేళ డీల్ కుదిరితే ప్రశాంత్ కిషోర్ ప్రధాని మోదీతో కలసి నేరుగా పనిచేయనున్నారు. నిజానికి 2014 ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం తర్వాతే ప్రశాంత్ కిషోర్ పేరు బాహ్య ప్రపంచానికి తెలిసింది. పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో ఆయన ఒక సంస్థను పెట్టుకుని నేతలకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావడం ఎలా? రాజకీయ వ్యూహాలు? సభల్లో ఎలా మాట్లాడాలి? ఏ సందేశం ఇవ్వాలనేది తదితర సేవల్ని అందిస్తుంటారు.