manohar parikar: నిలకడగా పారికర్ ఆరోగ్యం... ఆందోళన అక్కర్లేదు: గోవా మంత్రి వెల్లడి
- ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నారు
- వైద్య మంత్రి విశ్వజిత్ రాణే ప్రకటన
- నిన్న సాయంత్రం కడుపు నొప్పితో ఆస్పత్రిలో చేరిన పారికర్
అస్వస్థతకు గురై గోవా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది. పారికర్ తీవ్ర అస్వస్థతతో ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొంది ఈ నెల 22నే డిశ్చార్జ్ అయ్యారు. అదే రోజు గోవా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. నిన్న సాయంత్రం ఉన్నట్టుండి కడుపులో నొప్పి రావడంతో ఆయన్ను గోవా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించారు. దీనిపై ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి విశ్వజిత్ రాణే స్పందిస్తూ... ముఖ్యమంత్రి క్షేమంగానే ఉన్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని స్పష్టం చేశారు. పారికర్ ను ఆస్పత్రిలో చేర్పించిన సమయంలో ఆయన డీహైడ్రేషన్ తో బాధపడుతున్నట్టు వైద్యులు తొలుత ప్రకటించారు.