Chandrababu: మరో రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్‌బీఐని కోరతాం: చంద్రబాబు
- పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలి
- గతంలో రూ.500 కోట్ల నగదు విడుదల చేయాలని ఆర్బీఐకి లేఖ రాశాం
- వేసవిలో పశుగ్రాస కొరత లేకుండా శ్రద్ధ వహించాలి
- టెలికాన్ఫరెన్స్ లో అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
జల సంరక్షణ ఉద్యమం సత్ఫలితాలు ఇస్తోందని, రాష్ట్రంలో భూగర్భజలాలు 1.6మీ. పెరిగాయని, రాయలసీమలో 4.6 అడుగులు పెరిగాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు నీరు-ప్రగతి, వ్యవసాయంపై టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు.. అధికారులతో మాట్లాడారు. 'రెండవ దశ జల సంరక్షణ ఉద్యమం మరింత ఉత్సాహంగా నిర్వహించాలి. కాలువల్లో నీటి ప్రవాహానికి ఉన్న అవరోధాలు తొలగించాలి, గుర్రపుడెక్క పూర్తిగా తొలగించాలి. నరేగా ద్వారా గ్రామాల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేయాలి. 24కోట్ల పనిదినాల లక్ష్యాన్ని చేరుకోవాలి' అని చంద్రబాబు అన్నారు.
"రోజుకు 15 లక్షల పనిదినాల లక్ష్యంతో ప్రస్తుతం 11 లక్షల పని దినాలకు చేరాం, ఇది మరింత మెరుగుపడాలి. మొత్తం రూ.1045 కోట్లతో గ్రామాల్లో మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. అన్ని గ్రామాలు టెన్ స్టార్ రేటింగ్ లో ముందుండాలి. కరవు మండలాలలో అదనంగా మరో 50 పనిదినాలు కల్పించాలి. రోజు కూలి రూ.187 చెల్లించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. రబీలో వర్షపాతం లోటు అధికంగా ఉన్నప్పటికీ సాగు విస్తీర్ణం 95% కు చేరుకున్నాం. దిగుబడులు తగ్గకుండా చూడాలి.
రెయిన్ గన్లను సద్వినియోగం చేసుకోవాలి. సమర్థవంతంగా నీటి నిర్వహణ ద్వారా సాగునీటి కొరతను అధిగమించాలి. కరవును అధిగమించడంలో దావోస్ సదస్సులో చర్చించిన విధానం ప్రయోగాత్మకంగా పైలెట్ ప్రాజెక్టుగా కొన్ని గ్రామాలలో చేపట్టాలి. ఫలితాలను విశ్లేషించాలి. ఇంటర్మీడియట్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆర్టీసీ బస్సులు ప్రత్యేకంగా నడపాలి. అవాంతరాలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి.
అక్రమాలకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరించాలి. పరీక్షల నిర్వహణలో విద్యాశాఖ అధికారులకు రెవిన్యూ, పోలీస్ తదితర శాఖలు పూర్తి సహకారాన్ని అందించాలి. పింఛన్ల పంపిణీకి నగదు కొరత లేకుండా చూడాలి. గతంలో రూ.500 కోట్ల నగదు విడుదల చేయాలని ఆర్బీఐకి లేఖ రాశాం. మరో రూ.500 కోట్ల నగదును విడుదల చేయాలని కోరుతాం. వేసవిలో పశుగ్రాస కొరత లేకుండా శ్రద్ధ వహించాలి. ప్రతి పశువుకు పోషకాహారం అందించాలి.
గత ఏడాది ఎంత పశుగ్రాసం ఇచ్చాం, దానిని రెట్టింపుచేస్తే పాల దిగుబడి ఎంత పెరుగుతుందనేది విశ్లేషించాలి. దానికి తగ్గట్లుగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుచేయాలి. ఉపాధిహామీ కింద నర్సరీలు అభివృద్ధి చేయాలి. వాటిలో పెంచిన మొక్కలను రహదారులకు ఇరువైపులా ప్లాంటేషన్ కు వినియోగించుకోవాలి. తద్వారా పర్యావరణం అభివృద్ధికి కూడా నరేగా నిధులను సద్వినియోగం చేసుకోవాలి. వాయు కాలుష్యం నియంత్రణకు అన్ని చర్యలు తీసుకోవాలి. పీల్చే గాలి నాణ్యత (ఎయిర్ క్వాలిటి) మెరుగుపరచాలి. ఈ సమస్యలన్నీ మనం సృష్టించుకున్నవే... వాటిని పరిష్కరించే శక్తి కూడా మనలోనే ఉంది. మన శక్తి, సామర్థ్యాలు సద్వినియోగం చేసుకోవాలి.
సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. మన కష్టంతో మనరాష్ట్రాన్ని నిర్మించుకుంటున్నాం. మన కష్టానికి తగిన గుర్తింపు వస్తోంది. ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది. పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయి. విశాఖలో మూడవ సమ్మిట్ విజయవంతం కావడం శుభ పరిణామం. మూడు సమ్మిట్ లలో ఒప్పందాలన్నీ 13 జిల్లాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా జరిగాయి. వీటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలి" అని చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం ముఖ్యకార్యదర్శులు జవహర్ రెడ్డి, రాజశేఖర్, గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ కమిషనర్ రామాంజనేయులు, రియల్ టైం గవర్నెన్స్ ఎండీ అహ్మద్ బాబు, సెర్ఫ్ సీఈవో కృష్ణమోహన్, జలవనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వర రావు, ఇంటర్మీడియట్ విద్యా శాఖ కమిషనర్ ఉదయలక్ష్మి, వివిధ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.