Sridevi: గల్ఫ్ చట్టాలు కఠినం: శ్రీదేవి కేసులో దుబాయ్ రాజు కూడా వేలు పెట్టలేరట!
- బోనీని గంటలతరబడి విచారించారంటున్న భారత్ మీడియా
- బోనీని ఇంటరాగేట్ చేయలేదంటున్న దుబాయ్ మీడియా
- దుబాయ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసుకు సంబంధించిన విషయాలు బయటకు పొక్కకూడదు
ప్రముఖ సినీ నటి శ్రీదేవి మృతి కేసుపై మీడియా కథనాలు హోరెత్తుతున్నాయి. శ్రీదేవి గుండెపోటుతో చనిపోయిందని ఆమె మరిది సంజయ్ కపూర్ చెప్పగా, డెత్ సర్టిఫికేట్ లో 'ప్రమాదవశాత్తూ బాత్ టబ్ లో పడి మృతి' అంటూ పేర్కొన్నారు. దుబాయ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్ పేరుతో విడుదలైన రిపోర్ట్ ప్రాథమిక నివేదిక మాత్రమేనని, పూర్తి రిపోర్టు రావాల్సి ఉందని వార్తలు వెలువడుతున్నాయి.
కాగా, ఈ విషయంలో భారత్ లో వెలువడుతున్న కథనాలన్నీ ఊహాగానాలేనని, వాస్తవాలు ఎవరికీ తెలిసే అవకాశం లేదని దుబాయ్ చట్టాల గురించి అవగాహన ఉన్నవారు చెబుతున్నారు. బోనీకపూర్ ని గంటల తరబడి విచారించారని భారత్ మీడియా వార్తాకథనాలు ప్రసారం చేస్తుండగా, దుబాయ్ మీడియా ఆయనను పోలీసులు ఇంటరాగేట్ చేయలేదని స్పష్టం చేసింది.
గల్ఫ్ చట్టాల ప్రకారం విచారణలో ఉన్న కేసులకు సంబంధించి ఎలాంటి అంశాలనైనా అధికారులు బయటి వ్యక్తులెవరికీ వెల్లడించే వీలులేదు. ఒక కేసు విచారణలో ఆఖరుకి దుబాయ్ రాజు కూడా జోక్యం చేసుకునే ఆస్కారం లేదు. ఎవరి వద్దా స్పష్టమైన సమాచారం లేని నేపథ్యంలో ఊహాజనిత కథనాలు ప్రసారమవుతున్నాయని తెలుస్తోంది.