jaspreet bumra: టీమిండియాలో సుస్థిర స్థానం సంపాదించుకోనున్న బుమ్రా
- సఫారీ సిరీస్ లో అద్భుతంగా రాణించిన బుమ్రా
- మూడు టెస్టుల్లో 14 వికెట్లు తీసిన బుమ్రా
- బుమ్రాను ప్రశంసించిన కోహ్లీ
సఫారీ సిరీస్ తో టీమిండియా యువపేసర్ జస్ ప్రీత్ బుమ్రా జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ సిరీస్ లో మహమ్మద్ షమి (3 మ్యాచ్ లలో 15 వికెట్లు), బుమ్రా (3 మ్యాచ్ లలో 14 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (2 మ్యాచ్ లలో 10 వికెట్లు), ఇషాంత్ శర్మ (2 మ్యాచ్ లలో 8 వికెట్లు) అద్భుతంగా రాణించారు. ఈ టోర్నీలో బౌలర్లంతా కలసి 60 వికెట్లు తీయగా, 47 వికెట్లను పేసర్లే దక్కించుకోవడం విశేషం.
ఈ నేపథ్యంలో ఇన్నాళ్లూ వన్డే, టీ20 టోర్నీ బౌలింగ్ కు మాత్రమే పరిమితమైన యార్కర్ స్పెషలిస్టు బుమ్రా, ఇప్పుడు టెస్టు బౌలర్ గా కూడా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా గురించి కోహ్లీ మాట్లాడుతూ, బుమ్రా టెస్టు జట్టులో ఎంతో చక్కగా ఇమిడిపోయాడన్నాడు. జట్టుకు అవసరమైన ప్రతీసారి బ్రేక్ ఇచ్చాడని ప్రశంసించాడు. వికెట్లు తీసేందుకు తన సర్వశక్తులూ ఒడ్డాడని కోహ్లీ అభినందించాడు. టెస్టు క్రికెట్ ఆడాలన్న కోరిక బుమ్రాలో బలంగా ఉందని విరాట్ పేర్కొన్నాడు. దీంతో టెస్టుల్లో ఈ యార్కర్ స్పెషలిస్టు స్థానం పదిలం చేసుకున్నట్టు కనబడుతోంది.