Sridevi: ఇది శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ!: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
- క్షణక్షణం’, ‘గోవిందా గోవిందా’తో శ్రీదేవికి సన్నిహితంగా మెలిగే అవకాశం లభించింది
- సెలెబ్రిటీల జీవితం బాహ్య ప్రపంచం ఊహించిన దానికంటే భిన్నం
- శ్రీదేవి నిజంగా తన జీవితాన్ని ఆనందంగా గడిపిందా? : వర్మ
ప్రముఖ నటి శ్రీదేవి మృతి వార్త విన్న దగ్గర నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఆవేదనను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ‘శ్రీదేవి నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు మమ్మల్నందరినీ వదిలేసి దూరంగా వెళ్లిపోయినందుకు... ఆ పని మేము చేస్తున్నాం' , ‘ఈసారి ఆ దేవుడే ఒక జామురాతిరి ఆ జాబిలమ్మకు శాశ్వతంగా జోలపాడాడు. తన జాజికొమ్మను ఎక్కువకాలం భూలోకంలో ఉంచలేక శాశ్వతంగా తన దరికి చేర్చుకున్నాడు' అంటూ వర్మ చేసిన ట్వీట్లు మర్చిపోలేం.
తాజాగా, ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’ పేరిట ‘ఫేస్ బుక్’ ఖాతాలో వర్మ ఓ పోస్ట్ చేశారు. అందులో పలు సంచలన విషయాలను ప్రస్తావించారు. ఈ లేఖను బయటపెట్టాలా? వద్దా? అని తనలో తాను ఎంతో మధనపడ్డానని, ఎందుకంటే, కొన్ని పేర్లను బయటపెట్టాల్సి వస్తోందని వర్మ పేర్కొన్నారు. అయితే, ఎందరో అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి కేవలం ఒకరికి సొంతమైన వ్యక్తి కాదని బలంగా నమ్మానని, ఆమె అభిమానులకు ఈ వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని వర్మ తన లేఖలో పేర్కొన్నారు.
ఆ లేఖలో వర్మ ఏమన్నారంటే .. ‘ఆమె ఎంతో అందమైన, ఆకర్షణీయమైన మహిళ అని వేలాది మంది అభిమానులు నమ్మినట్టే నేను కూడా ఎప్పటికీ నమ్ముతాను. దేశంలోనే అతిపెద్ద సూపర్ స్టార్ గా ప్రధాన హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఇరవై ఏళ్ల పాటు ఆమె ఏలిన విషయం మనందరికీ తెలుసు. అదంతా, ఆమె జీవితంలో ఓ భాగం మాత్రమే. శ్రీదేవి మరణంతో నేను ఎంతో దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యానో... ఆమె జీవితం మాదిరిగానే, ఆమె మరణం కూడా చాలా మిస్టీరియస్ గా ఉంది.
‘క్షణంక్షణం’, ‘గోవిందా గోవిందా’ చిత్రాలతో ఆమెకు సన్నిహితంగా మెలిగే అవకాశం నాకు లభించింది. సెలెబ్రిటీల వాస్తవ జీవితం బాహ్య ప్రపంచం ఊహించిన దానికంటే భిన్నంగా ఉంటుంది. ఆ భిన్నమైన జీవితాల్లో కెల్లా శ్రీదేవి జీవితం ప్రత్యేకమైంది. శ్రీదేవి జీవితం అద్భుతంగా ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఎంతో అందం, గొప్ప ప్రతిభ, ఇద్దరు అందమైన కూతుళ్లతో శ్రీదేవి జీవితం సాఫీగా సాగిపోయిందని చాలామంది భావిస్తారు. బయట నుంచి చూస్తే ఏదైనా ఇలాగే అద్భుతంగా కనిపిస్తుంది. కానీ, శ్రీదేవి నిజంగా తన జీవితాన్ని ఆనందంగా గడిపిందా?’ అని తన లేఖలో వర్మ ప్రశ్నించారు.