BJP: పదకొండు లక్షల ఉద్యోగాలొస్తుంటే ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు?: సోము వీర్రాజు
- ఏడాదికి కేవలం మూడు వేల కోట్లు వచ్చే ప్రత్యేక హోదా దండగ
- మోదీ విధానాల వల్లే ‘కియా’ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయి
- చంద్రబాబు ముందు నిలబడి కూడా వాస్తవాలు మాట్లాడగలను
- మీడియాతో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు
సీఐఐ భాగస్వామ్య సదస్సు ద్వారా రూ. 4 లక్షల పెట్టుబడులు, పదకొండు లక్షల ఉద్యోగాలొస్తుంటే ఇంకా ఏపీకి ప్రత్యేక హోదా ఎందుకు? అని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏడాదికి కేవలం మూడు వేల కోట్లు వచ్చే ప్రత్యేక హోదా దండగ అని అన్నారు. భాగస్వామ్య సదస్సుకు వచ్చిన వారిలో ఏ ఒక్కరైనా ఏపీకి ప్రత్యేక హోదా లేదే అని అడిగారా? అని ఆయన ప్రశ్నించారు.
మూడుసార్లు నిర్వహించిన భాగస్వామ్య సదస్సు ద్వారా, మోదీ విధానాల వల్లే కియా మోటార్స్ వంటి సంస్థలు ఏపీకి వస్తున్నాయని, చంద్రబాబు ముందు నిలబడి కూడా వాస్తవాలను మాట్లాడగలనని వీర్రాజు అన్నారు. రాసిచ్చిన స్క్రిప్ట్ ను మూడు నిమిషాలు పార్లమెంట్ లో చదివితే గల్లా జయదేవ్ కు సన్మానాలు చేస్తారా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్తవాలు మాట్లాడేందుకు తనకు వైసీపీ డైరెక్షన్ అవసరమా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా ఉద్యమం పేరుతో కమ్యూనిస్టు నాయకులు ఫ్రీగా ప్రచారం పొందుతున్నారని, తమపై వస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకు అస్త్రాలు ఉన్నాయని ఈ సందర్భంగా సోము వీర్రాజు స్పష్టం చేశారు.