ipl: పాక్ క్రికెట్ లీగ్ పై సోషల్ మీడియా సెటైర్లు
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పీఎస్ఎల్ ఫొటో
- పాక్ అభిమానులను ఎద్దేవా చేస్తున్న టీమిండియా అభిమానులు
- స్టేడియంలో కనీసం ఛీర్ లీడర్స్ కూడా లేరంటూ ఎగతాళి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ పట్టణంలో మ్యాచ్ జరిగినా టికెట్లు దొరక్క అభిమానులు ఇబ్బందిపడుతుంటారు. అలాగే ఐపీఎల్ మ్యాచ్ ల సమయంలో టీవీల టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరిగిపోతుంటుంది. దీంతో బీసీసీఐకి పోటీగా పీసీబీ పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ను ప్రవేశపెట్టింది. పాక్ లో ఆడేందుకు ఆటగాళ్లు ముందుకు రాకపోవడంతో దుబాయ్ వేదికగా ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం సీజన్ 3 లీగ్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పీఎస్ఎల్ ఆరంభ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ పాక్ క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కు పీఎస్ఎల్ తక్కువ కాదని పేర్కొంటూ కామెంట్లతో హోరెత్తించారు. తాజాగా పీఎస్ఎల్ కు సంబంధించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటో పీఎస్ఎల్ లీగ్ సందర్భంగా తీసినది. ఇందులో మ్యాచ్ చూసేందుకు అభిమానుల ఆసక్తి చూపలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. గ్యాలరీలన్నీ ఖాళీగా కనిపించాయి.
దీంతో భారత క్రికెట్ అభిమానులు ఈ ఫొటో షేర్ చేసుకుంటూ, 'మా ఐపీఎల్ జరిగే సమయంలో గ్యాలరీలు ఖాళీగానే కనిపించవు. ఎప్పుడూ అభిమానులతో నిండిపోయే ఉంటాయి. మీలా కాదు' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరు అభిమానులు ‘భూమిపై మనుషులు అత్యల్పంగా కనిపించే ప్రదేశాల్లో పీఎస్ఎల్ జరిగే చోటు ఒకటి' అని వ్యాఖ్యానించి భారత అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. ఐపీఎల్ vs పీఎస్ఎల్, మీ లీగ్ లో కనీసం ఛీర్ లీడర్స్ కూడా మైదానంలో కనిపించడం లేదు అంటూ ఎద్దేవా చేస్తున్నారు.