Ravi Shastri: విమర్శకులపై విరుచుకుపడిన రవిశాస్త్రి..!

  • టీమిండియా ఓడిపోతే సంతోషపడతారని ధ్వజం
  • దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమిపై వివరణ
  • టీమిండియాపై దేశీ ఫ్యాన్స్‌కు భారీ అంచనాలుంటాయని వ్యాఖ్య

టీమిండియా కోచ్ రవిశాస్త్రి విమర్శకులపై విరుచుకుపడ్డారు. టీమిండియా ఓడిపోతే భారత్‌లోని జనాలు (విమర్శకులను ఉద్దేశించి) ఆనందపడతారని అప్పుడప్పుడు తనకు అనిపిస్తుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోవడంపై విమర్శకుల నుంచి వచ్చిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన 'మిడ్-డే' పత్రికతో మాట్లాడుతూ ఈ మేరకు ఘాటుగా స్పందించినట్లు అర్థమవుతోంది.

ఏ మ్యాచ్‌నైనా గెలుస్తామనే నమ్మకం తమకు ఎల్లప్పుడూ ఉంటుందని, అది కొద్దిమంది మాత్రమే గ్రహించారని, నిజానికి ఓడిన ఆ రెండు టెస్టు మ్యాచ్‌లను కూడా తాము గెలిచి ఉండేవాళ్లమని ఆయన చెప్పుకొచ్చారు. ఆ మ్యాచ్‌లు ఓడిపోగానే తదుపరి మ్యాచ్‌లు గెలవడమే గానీ డ్రా చేసుకోవడం ఉండరాదంటూ ఓ ప్రణాళికను రచించుకుని ముందుకు వెళ్లామని, ఫలితంగానే వన్డే, టీ-20 సిరీస్‌లను నెగ్గామని రవిశాస్త్రి వివరించారు. జోహ్నెస్ బర్గ్ పిచ్ పనికిమాలిన పిచ్ అని ఆయన వ్యాఖ్యానించారు.

దక్షిణాఫ్రికా సుదీర్ఘ పర్యటనలో టీమిండియా ఆడిన మొత్తం 12 మ్యాచ్‌లలో ఎనిమిది మ్యాచ్‌లు గెలిచామని ఆయన గుర్తు చేశారు. లంక ముక్కోణపు సిరీస్ గురించి కూడా ఆయన మాట్లాడారు. విరామం లేకుండా ఆడినందు వల్ల జట్టులో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చామని, వారు కూడా మనుషులే కదా అని ఆయన వ్యాఖ్యానించారు. ఎలాంటి ఫార్మాట్ అయినా సరే మన జట్టే గెలవాలని భారత అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకుంటారని, మనదేశంలో వచ్చిన అతిపెద్ద చిక్కు ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News