KTR: జానా బాబా 40 దొంగలు!: కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలను దొంగలతో పోల్చిన కేటీఆర్
- ప్రతి ఒక్కరిపైనా కేసులున్నాయని వెల్లడి
- జానా మంత్రిగా ఉన్నప్పుడు ఫ్లోరోసిస్ గుర్తుకు రాలేదా?
- ప్రశ్నించిన మంత్రి తారక రామారావు
సూర్యాపేట జిల్లా మద్దిరాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు బస్సు యాత్రలను చేయడాన్ని ప్రస్తావిస్తూ, "ఆలీబాబా 40 దొంగలు అన్నట్టుగా జానా బాబా 40 దొంగల మాదిరి సిగ్గు, ఎగ్గూ లేకుండా బస్సు యాత్ర చేస్తున్నారు. వీరందరిపైనా కేసులు ఉన్నాయి" అని ఎద్దేవా చేశారు.
రాష్ట్రాన్ని 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్, జిల్లాకు కృష్ణా జలాలను తెచ్చుంటే 2 లక్షల మంది ఫ్లోరోసిస్ వ్యాధి బారిన పడేవారు కాదని అన్నారు. 15 సంవత్సరాలపాటు రాష్ట్రానికి మంత్రిగా ఉన్న జానాకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తాగేందుకు మంచి నీరు దొరకక ప్రజలు పడుతున్న అవస్థలు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో లక్ష ఎకరాలకు సాగునీరందించేలా వెంపటి, రుద్రమదేవి చెరువులను కలుపుతూ పెద్ద జలాశయాన్ని ఏర్పాటు చేస్తామని, జిల్లాను అభివృద్ధి పథంలోకి నడిపిస్తామని అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసిన తరువాత ఈ మూడేళ్ల వ్యవధిలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడి జిల్లాకు వచ్చిందని గుర్తు చేసిన కేటీఆర్, యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించేందుకు తుంగతుర్తి సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తామని, ఆ బాధ్యతను తానే స్వయంగా తీసుకుంటున్నానని వెల్లడించారు.