Sigma College of Narsing School: ప్రమాదమా? అత్మహత్యాయత్నమా?... ఐదో అంతస్తు నుంచి పడి మృత్యుంజయురాలైన హైదరాబాద్ యువతి!
- నర్సింగ్ కాలేజీలో చదువుతున్న బాధితురాలు
- ఐదో అంతస్తుపై నుంచి పడ్డ అశ్విని
- కింద ఇసుక కుప్ప ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డ అశ్విని
- ప్రాణాపాయం లేదన్న వైద్యులు
ఓ యువతి తాను చదువుతున్న కాలేజీ భవంతి ఐదో అంతస్తు నుంచి కింద పడి ప్రాణాలతో బయటపడిన ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఇది ప్రమాదమా? లేక ఆత్మహత్యాయత్నమా? అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు. కేసు మరిన్ని వివరాల్లోకి వెళితే, నల్గొండ జిల్లాకు చెందిన బి.అశ్విని (20) హైదరాబాద్ సిగ్మా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ లో మూడో సంవత్సరం చదువుతూ, ఈసీఐఎల్ లోని తులసీ ఆసుపత్రిలో పని చేస్తోంది.
గత సోమవారం నాడు నర్సింగ్ స్కూల్ నుమౌలాలిలోని కొత్త భవంతిలోకి మార్చారు. భవంతి టెర్రస్ పైకి వెళ్లిన అశ్వని కింద పడిపోయింది. అయితే, కింద ఇసుక కుప్ప ఉండటంతో ప్రాణాలతో బయటపడింది. కుడి చెయ్యితో పాటు పక్కటెముకలు విరిగాయని, ప్రాణాలకు ప్రమాదం లేకున్నా, ప్రస్తుతం ఆమె మాట్లాడలేని స్థితిలో ఉందని వైద్యులు వెల్లడించారు. ఇప్పటివరకూ ఘటనపై ఫిర్యాదులు రాలేదని, బాధితురాలితో మాట్లాడిన తరువాతే ఘటన గురించి పూర్తి సమాచారం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.