Hyderabad: పోలీసా?... ప్రెస్సా?... ఆగండంటూ సరికొత్త స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టిన హైదరాబాద్ పోలీసులు!
- తనిఖీల నుంచి తప్పించుకునేందుకు తప్పుడు స్టిక్కర్లు
- వారం రోజుల వ్యవధిలో పట్టుబడిన 892 మంది
- తొలితప్పుగా హెచ్చరించి వదిలేస్తున్న పోలీసులు
- మళ్లీ పట్టుబడితే కేసులు తప్పవని హెచ్చరికలు
పోలీసులు జరిపే వాహన తనిఖీల నుంచి తప్పించుకోవాలన్న ఉద్దేశంతో టూవీలర్లకు, కార్లకు 'పోలీస్', 'ప్రెస్' అన్న స్టిక్కర్లను తగిలించుకుని తిరుగుతున్న వారిని గుర్తించేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ ను ప్రారంభించారు. ఎటువంటి అక్రిడేషన్, పత్రికా సంస్థల గుర్తింపు కార్డు, పోలీసులమని చెప్పే ఐడీ కార్డు లేకుండా తమ వాహనాలకు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిని రోడ్డుపైనే ఆపి, ఆ స్టిక్కర్లను తొలగించి, వార్నింగ్ ఇస్తున్నారు. ఇక అదే వాహనాలకు చలాన్లు ఉంటే, వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు.
గడచిన వారం రోజుల వ్యవధిలో 892 మంది ఇలా తప్పుడు స్టిక్కర్లు వేసుకుని తిరుగుతున్న వారిని పోలీసులు పట్టుకోవడం గమనార్హం. ఈ తనిఖీల్లో భాగంగా పలువురు సొంతంగా పత్రికా విలేకరినని గుర్తింపు కార్డులను తయారు చేసుకున్నారని పోలీసులు గుర్తించడం గమనార్హం. సోహన్ లాల్ అనే యువకుడు హవాలా రాకెట్ లో పట్టుబడగా, అతని వద్ద నకిలీ ప్రెస్ ఐడీ కార్డు ఉందని పోలీసులు వెల్లడించారు.
ఇక తాము ఆపిన తరువాత నకిలీ స్టిక్కర్ ఉందని రుజువై, అధిక సంఖ్యలో చలాన్లు ఉన్న వాహన దారులను కోర్టుకు కూడా తీసుకు వెళుతున్నారు. రోజూ కనీసం 80 మంది వరకూ తమకు పట్టుబడుతున్నారని, పోలీస్ స్టిక్కర్ ఉన్న వారిలో చాలా మంది పోలీసుల బంధువులని, వారిని గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నామని ఉన్నతాధికారులు తెలిపారు. పోలీస్, ప్రెస్ స్టిక్కర్లను అక్రమంగా వాడుతున్న వారిని గుర్తించేందుకే స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, పరిచయం ఉన్న పోలీసులను, వాస్తవంగా విలేకరులుగా ఉన్న వారినీ ఏమీ అనడం లేదని, వారి వాహనాలకు స్టిక్కర్ ఉండవచ్చని చెబుతున్నారు. తాము తొలగించిన తరువాత మరోసారి స్టిక్కర్ తో పట్టుబడితే మాత్రం కేసులు తప్పవని హెచ్చరించారు.