Daily Mail: ఇక్కడ మగవాళ్లు లేరు...వెళ్లిపో మోహినీ...!: థాయ్‌లాండ్‌లోని ఓ గ్రామంలో విచిత్ర పరిస్థితి
- మగవాళ్లను మోహనీ దెయ్యం చంపేస్తోందని భయాందోళనలు
- ఇళ్ల ముందు దిష్టిబొమ్మల ఏర్పాటు
- మగవాళ్లకు బలవంతంగా చీరల ధరింపు
ఈశాన్య థాయ్‌లాండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది. కొద్ది వారాలుగా ఐదుగురు పురుషులు ఆ గ్రామంలో ఒకే రీతిలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఇందుకు కారణం...చనిపోయిన ఓ మహిళ దెయ్యంగా మారి తమ ఊరిలోని మగవాళ్లను తన సుఖం కోసం చంపేస్తోందని స్థానికులు చెబుతున్నారు. మగవాళ్లు నిద్రించేటప్పుడు మోహనీ వారి శరీరాల్లోకి ప్రవేశించి నిద్రలోనే వారికి ఊపిరిసలపకుండా చేసి చంపేస్తోందని వారు ఆరోపిస్తున్నారు. చంపిన తర్వాత వారి ఆత్మలను దెయ్యం తన సుఖాల కోసం తనతో పాటే పై లోకాలకు తీసుకెళ్లిపోతోందని వారు చెబుతున్నారు.
అందువల్ల దెయ్యం నుంచి తమ భర్తలను కాపాడుకునేందుకు ఆ ఊరిలోని భార్యలు పలు మార్గాలను అనుసరిస్తున్నారు. ప్రతి ఇంటి ముందు దిష్టిబొమ్మలను ఉంచుతున్నారు. అంతేకాక రాత్రి పూట పడుకునే ముందు పురుషులకు ఆడవాళ్ల మాదిరిగా చీరలు కడుతున్నారు. అంటే, చూడటానికి అచ్చం ఆడవాళ్ల మాదిరిగా వారిని తయారు చేస్తున్నారు. మరోవైపు తమ ఇళ్ల ముందు ఇక్కడ మగవాళ్లు లేరంటూ కొన్ని లేబుళ్లను కూడా అంటిస్తున్నారు. తమ పసుపు కుంకుమలను నిలుపుకోవాలనేది భార్యల ఆశ....!
వారి ఆశ, ప్రయత్నం ఎట్టకేలకు ఫలించినట్లే ఉంది. ఎందుకంటే, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసిన తర్వాత ఆ ఊరిలో ఒక్క మగాడు కూడా మరణించలేదట. ఇప్పటివరకు ఐదుగురు యువకులు ఒకే రీతిలోనే అంటే స్నానం చేసుకుని బెడ్‌పైకి వెళ్లి పడుకుని నిద్రలోకి జారుకోగానే మరణించారని 'డైలీ మెయిల్' పత్రికకు 68 ఏళ్ల నోంగ్ అయూ చెప్పుకొచ్చారు. మగవాళ్లపై మోహినీ దెయ్యం ప్రతీకారం తీర్చుకుంటోందని భయపడిన 90 మంది జనాభా ఉన్న నఖోన్ ఫనోమ్ గ్రామంలోని మహిళలు ఈ రకంగా తమ భర్తలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, హేతువాదులు మాత్రం ఈ భయాలను కొట్టిపారేస్తున్నారు. దెయ్యాలు వంటివి లేవని, ఇదంతా ఒట్టిదేనని చెబుతూ, ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.