Tollywood: టాలీవుడ్ ఒంటరి... చక్కగా సినిమాలు ప్రదర్శిస్తున్న తమిళనాడు, కర్ణాటక, కేరళ!
- థియేటర్లను బంద్ చేయని రాష్ట్రాలు
- తెలంగాణ, ఏపీల్లో మాత్రం సినిమా హాల్స్ మూత
- అడ్వాన్స్ డబ్బు వెనక్కు ఇస్తున్న యాజమాన్యాలు
దక్షిణాది చిత్ర పరిశ్రమలో టాలీవుడ్ ఒంటరైపోయింది. డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలయిన యూఎఫ్ఓ, క్యూబ్ తదితర సంస్థల వసూలు చేస్తున్న ఫీజులు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ, నేటి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో సినిమా థియేటర్ల మూసివేత నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాల్స్ అన్నింటి ముందూ నేడు సినిమాల ప్రదర్శన ఉండదని, ముందస్తుగా టికెట్లు తీసుకున్న వారికి డబ్బులు వెనక్కు ఇస్తామన్న బోర్డులు వెలువగా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో మాత్రం థియేటర్ల యాజమాన్యాలు మామూలుగానే సినిమాలను ప్రదర్శించుకుంటున్నాయి. ఇదే సమయంలో డిజిటల్ కంపెనీలకు వ్యతిరేకంగా తాము నిరసన ప్రదర్శనలు మాత్రం నిర్వహిస్తామని, థియేటర్లు బంద్ చేస్తే, ఎంతో మంది చిన్న నిర్మాతలు తీవ్రంగా నష్టపోతారని కోలీవుడ్, మాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడ తదితర నగరాల్లోని మల్టీ ప్లెక్సుల్లో చిత్రాల ప్రదర్శనపై సందిగ్ధత నెలకొంది.