KCR: దద్దమ్మ కేసీఆర్.. కేంద్రాన్నే ప్రశ్నిస్తారా? బండారు దత్తాత్రేయ ధ్వజం
- లక్షన్నర కోట్ల బడ్జెట్ లో వ్యవసాయానికి 10 వేల కోట్లు కూడా కేటాయించలేదు
- ఇలాంటి దద్దమ్మలా కేంద్రాన్ని ప్రశ్నించేది
- కేసీఆర్ కపట రాజకీయాలతో అందరూ విస్తుపోతున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను దద్దమ్మ అంటూ కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. లక్షన్నర కోట్ల రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయానికి రూ. 10 వేల కోట్లు కూడా కేటాయించలేని దద్దమ్మలు కేంద్ర ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. దేశంలో రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని... అలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీతో పోలుస్తారా? అంటూ మండిపడ్డారు. రాష్ట్రం నుంచి మంత్రులు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే... కేంద్ర మంత్రులు వేల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నారని చెప్పారు.
కేసీఆర్ కపట రాజకీయాలను చూసి అందరూ విస్తుపోతున్నారని దత్తాత్రేయ అన్నారు. వ్యవసాయం పేరిట కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లే విధంగా కేసీఆర్ రాజకీయాలు ఉన్నాయని... తెలంగాణ రైతులు వాస్తవాలను గ్రహిస్తున్నారని చెప్పారు. పస లేని వ్యాఖ్యలతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్థాయిని దిగజార్చుకోరాదని సూచించారు.